‘SUVలో రేప్‌కు అంత స్థలం ఉంటుందా..?’

గుజరాత్‌లోని వడోదర ఆర్టీఓ అధికారులకు ఓ వింతైన అభ్యర్థన వచ్చింది. ఒక స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం

Published : 10 May 2021 01:07 IST

ఆర్టీవో అధికారులకు పోలీసుల నుంచి వింత అభ్యర్థన

వడోదర : గుజరాత్‌లోని వడోదర ఆర్టీఓ అధికారులకు ఓ వింతైన అభ్యర్థన వచ్చింది. ఒక స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం(ఎస్‌యూవీ)లో అత్యాచారానికి పాల్పడే అంత స్థలం ఉంటుందా.. నిర్ధారించాలని  జిల్లా పోలీసు విభాగానికి చెందిన స్థానిక క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి ఆర్టీవో అధికారులకు ఓ అభ్యర్థన అందింది. ఓ అత్యాచార కేసు విచారణకు సంబంధించి క్రైమ్‌ బ్రాంచ్‌ ఈ సమాచారాన్ని కోరింది. ఎస్‌యూవీలో ముందు సీటుని వెనక్కి నెట్టిన తర్వాత తగినంత స్థలం ఉంటుందా.. తెలియజేయాలని పేర్కొంది. అలాగే వాహనం సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ గురించి కూడా సమాచారం కావాలని అడిగింది.

ఇలాంటి సమాచారం కోరడం ఇదే మొదటిసారని ఆర్టీవో అధికారులు ఆశ్చర్యం  వ్యక్తం చేశారు. సీట్లను వెనక్కి నెట్టడం ద్వారా లభించే స్థలం, సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ గురించి సాంకేతిక ధ్రువీకరణ పత్రం కావాలని పోలీసులు అడిగారని ఆర్టీవో అధికారులు తెలిపారు. అయితే ఆర్టీవో కేవలం గణిత నివేదికను మాత్రమే ఇవ్వగలదని అధికారులు స్పష్టం చేశారు. నేరం జరిగిందో లేదో పోలీసులే నిర్ధారించాలని పేర్కొన్నారు.

బాధితురాలు పేర్కొన్నట్లుగా ఆ వాహనంలో నేరం జరిగిందని నిరూపించడానికి ఆ వాహనానికి సంబంధించి సాంకేతిక ధ్రువీకరణ పత్రం అవసరమని.. అందుకే ఆర్టీవోను ఆ సమాచారం కోసం కోరినట్లు క్రైమ్‌బ్రాంచ్‌ అధికారులు తెలిపారు.

గత నెల 26 అర్ధరాత్రి సమయంలో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసులో నిందితుడైన పాద్రా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌ భవేశ్‌ పటేల్‌ను  మే 2న అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పటేల్‌ స్థానికంగా పేరున్న నాయకుడని.. అతడిపై ఇదివరకే 18 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బలమైన ఆధారలు సంపాదించడం కోసం ఆర్టీవో అధికారులను సంప్రదించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని