మన్‌సుక్‌ హిరేన్‌ హత్య: వాజేనే కీలక సూత్రధారి!

ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద లభించిన వాహన యజమాని మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో ఇప్పటికే సస్పెండైన సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) పేర్కొంది.

Updated : 24 Mar 2021 13:03 IST

ఏటీఎస్‌ దర్యాప్తు బృందం వెల్లడి

ముంబయి:  మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో ఇప్పటికే సస్పెండైన సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) పేర్కొంది. ఈ కేసులో సచిన్‌ వాజే కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఏటీఎస్‌ చీఫ్‌ జైజీత్‌ సింగ్‌ వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న సచిన్‌ వాజేను తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్‌ఐఏ కోర్టును సంప్రదిస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో సచిన్‌ వాజే కుట్రకు గల ఉద్దేశాన్ని మాత్రం ఏటీఎస్‌ అధికారులు వెల్లడించలేదు.

ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్‌ లభించిన కేసును ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. ఆ వాహన యజమానిగా భావిస్తోన్న మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసును మాత్రం ముంబయి ఏటీఎస్‌ దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఓ వోల్వో కారును సీజ్‌ చేశామని, ఫోరెన్సిక్‌ బృందం వాటిని పరీక్షిస్తోందని ఏటీఎస్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే మన్‌సుక్‌ హత్యలో సచిన్‌ వాజే కీలక నిందితుడిగా ఉన్నప్పటికీ, ఘటన జరిగే వేళ ఆయన అక్కడ ఉండకపోవచ్చని, హత్య చేయమని మాత్రం ఆదేశించి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. సచిన్‌ వాజేను విచారించకుండానే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పొందగలిగామని ఏటీఎస్‌ అధికారులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా సచిన్‌ వాజేను కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్‌ఐఏ కోర్టును సంప్రదిస్తామని పేర్కొన్నారు. 

ఇక ఈ కేసుతో సంబంధముందని భావిస్తోన్న మాజీ కానిస్టేబుల్‌తో పాటు నరేష్‌ ధారే అలియాస్‌ నరేష్‌ గౌర్‌ అనే బుకీలను రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగానే హిరేన్‌ హత్యకేసులో సచిన్‌ వాజే హస్తమున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు. వీరే కాకుండా ఈ కేసులో చాలా మంది హస్తం ఉందని, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరుగుతాయని ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని