Delhi: దారివ్వాలని కారు హారన్‌ మోగించినందుకు మహిళపై దాడి!

గుడ్‌గావ్‌లో రోడ్డుపై దారివ్వమని కారు హారన్‌ మోగించిన మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో సదరు మహిళ ఎడమ కన్ను, ముక్కుపై గాయాలైనట్లు తెలిపింది.

Published : 20 Jan 2023 00:18 IST

దిల్లీ: దేశ రాజధానిలో మహిళలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఉదంతం మరవకముందే.. గురువారం దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ను కారుతో కొన్నిమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా హారన్‌ కొట్టారనే కారణంతో కారులో వెళుతున్న మహిళను ఆపి నడిరోడ్డులో ఆమెపై దాడికి పాల్పడిన ఘటన గుడ్‌గావ్ ఎమ్‌డీఐ చౌక్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గుడ్‌గావ్‌కు చెందిన ఓ మహిళ ఆర్థికసేవలకు సంబంధించిన ఓ సంస్థలో పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఆమె కారులో వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఆమె వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి దారికి అడ్డుగా ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి బాధిత మహిళను కారు నుంచి బయటకు లాగి పలుమార్లు ఆమె చెంపపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరోసారి ఇంటికి వచ్చి కొడతానని , చంపేస్తానంటూ సదరు వ్యక్తి బెదిరించినట్లు ఆమె తెలిపింది. రోడ్డుపై వెళుతున్న సమయంలో దారివ్వాలని కారు హారన్‌ మోగించింనందుకే సదరు వ్యక్తి తనపై నడిరోడ్డులో దాడి చేసినట్లు వాపోయింది. ఈ ఘటన చూసిన కొందరు వ్యక్తులు అక్కడి రావడంతో ఆ వ్యక్తి ఘటనా స్థలం పరారైనట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దాడిలో తన ఎడమ కన్ను, ముక్కుపై గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుర్తితెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని