Chirala: యువతిపై అత్యాచారం.. హత్య

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో శుక్రవారం ఉదయం ఘోరం చోటుచేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి, హతమార్చిన వైనం కలకలం రేపింది.

Published : 22 Jun 2024 06:09 IST

బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం
వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు
నిందితులను 48 గంటల్లో పట్టుకోవాలని పోలీసులకు ఆదేశం
ఘటనాస్థలికి హోం మంత్రి అనిత
బాధిత కుటుంబానికి పరామర్శ
ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల సాయం

చీరాల అర్బన్, గ్రామీణం, బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో శుక్రవారం ఉదయం ఘోరం చోటుచేసుకుంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి, హతమార్చిన వైనం కలకలం రేపింది. ఈపూరుపాలెం రైల్వేస్టేషన్‌ సమీపంలోని సీతారామపేటకు చెందిన చేనేత కార్మికుడి కుమార్తె (21) పక్కనే ఉన్న శ్మశానం సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. కుమార్తె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈలోపు శ్మశానంలో చిల్లచెట్ల మధ్య విగతజీవిగా పడిఉన్న యువతిని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్, చీరాల డీఎస్పీ ప్రసాద్, రూరల్‌ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు జాగిలాలను రప్పించి, నిందితుల జాడ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. తమ బిడ్డ టైలరింగ్‌ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటోందని, మరో వ్యాపకం లేదని మంత్రికి చెప్పారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. చీరాల ఏరియా వైద్యశాలలో మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఘటన జరిగిన తీరు చూస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా.. ఇంకా అడవుల్లోనే బతుకుతున్నామా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి రావాలని తనను పంపించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీతో మాట్లాడారని, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ దీనిపై స్పందించారని చెప్పారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం చెక్కును
చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు అందజేస్తున్న హోం మంత్రి అనిత 

5 ప్రత్యేక బృందాలతో గాలింపు

నిందితులను 48 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసులను సీఎం చంద్రబాబు ఆదేశించారని హోం మంత్రి అనిత అన్నారు. బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రంజిత్‌ బాషా, గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో ఆమె శుక్రవారం రాత్రి సమావేశమై, హత్య కేసు దర్యాప్తును సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులను పట్టుకోవటానికి ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాల్‌ డేటా, టవర్‌ డంప్‌ ద్వారా సమాచారం సేకరించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రూ.10 లక్షల సాయం చెక్కును చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య ద్వారా బాధిత కుటుంబానికి వెంటనే అందజేస్తున్నట్లు తెలిపారు. 

గంజాయి బ్యాచ్‌ పనేనా?

గంజాయి బ్యాచ్‌ ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నట్లు హోం మంత్రి చెప్పారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు సీఐడీలో నార్కొటిక్స్‌ విభాగం ఉన్నా వైకాపా పాలనలో పూర్తిగా పక్కన పెట్టారన్నారు. దీంతో రాష్ట్రంలో గంజాయి మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయని.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. నార్కొటిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేసి, రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని