Bengaluru Horror: యువతిపై ఘోరం.. కారులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!

యువతిని బలవంతంగా లాక్కెళ్లి కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది.

Updated : 31 Mar 2023 18:17 IST

బెంగళూరు:  కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో  దారుణం చోటుచేసుకుంది.  19 ఏళ్ల యువతిని కారులోకి బలవంతంగా లాక్కెళ్లిన నలుగురు దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  నగరంలోని ఓ పార్కులో తన స్నేహితుడితో కలిసి కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన దుండగులు యువతిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువతి కోరమంగళ నేషనల్‌ గేమ్స్‌ విలేజ్‌ పార్కు వద్ద రాత్రి 9.30గంటల సమయంలో కూర్చొని ఉంది. అక్కడికి వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి.. కదులుతున్న కారులోనే అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆ సమయంలో ఆమె పక్కన తన స్నేహితుడు ఉండగా.. అతడిని బెదిరించి యువతిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లినట్టు సమాచారం. 

అనంతరం దోమ్లూర్‌, ఇందిరానగర్‌, అనేకల్‌, నైస్‌రోడ్‌మీదుగా కారును నడుపుతూ తనపై కిరాతకానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున 4గంటల సమయంలో తన ఇంటికి సమీపంలోని రోడ్డుపక్కన వదిలి వెళ్లిపోయారని తెలిపింది. ఈ విషయం గురించి పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఇంటికి చేరుకున్నాక ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను నగరంలోని ఇజీపురాకు చెందిన సతీశ్‌, విజయ్‌, శ్రీధర్‌, కిరణ్‌లను అరెస్టు చేశారు. వీరి వయసు 22 నుంచి 26 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు నిందితులు ప్రైవేటు సంస్థల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తుంటారని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని