యూపీలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం

స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఓ దళిత యువతి(19)పై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో గత నెల 31న చోటుచేసుకుంది.

Published : 08 Jun 2021 01:31 IST

ఏడుగురు నిందితుల్లో ముగ్గురి అరెస్టు 

బరేలీ: స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఓ దళిత యువతి(19)పై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో గత నెల 31న చోటుచేసుకుంది. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా.. మరొకరిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు అబ్బాయిలతో కలిసి యువతి స్కూటీపై బయటకు వెళ్లింది. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు వారిని అడ్డగించి తన మిగతా అయిదుగురు స్నేహితులను అక్కడికి పిలిచాడు. వారు వచ్చాక బాధితురాలితో ఉన్న ఇద్దరు అబ్బాయిలను అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆపై ఆమెను కొట్టి..  డబ్బు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. 


అయితే ఆ యువతి తనపై జరిగిన ఘాతుకాన్ని తొలుత కుటుంబసభ్యులకు చెప్పలేదు.  తర్వాత తన సోదరికి జరిగిన ఘోరాన్ని వివరించింది. నిందితులపై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను శనివారం రాత్రి గుర్తించారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోవడానికి యత్నించారు. కానీ పోలీసులు వారిని వెంబడించి ఒకరి కాలిపై తుపాకీతో కాల్చారు. దీంతో వారు పోలీసులకు లొంగిపోయారు. గాయపడిన నిందితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అరెస్టయిన వారిని విశాల్‌ పటేల్‌(22) అనుజ్‌ పటేల్‌(23) గా గుర్తించారు. వికాస్‌ అనే వ్యక్తి అత్యాచార ఘటనను ఫొటోలు తీసినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. వారు చేసిన నేరానికి సంబంధించి ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. అయితే అత్యాచార ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి వివరాలు తెలిపినట్టు పోలీసులు చెప్పారు.  పరారీలో ఉన్న నలుగురు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని