Crime News: ‘అమ్మ’నని నమ్మించేందుకు.. బాలుడి అపహరణ.. మూడు గంటల్లోనే పట్టివేత

తాను తల్లినయ్యానని అబద్ధమాడి.. దాన్ని నిరూపించేందుకు ఓ బాలుడిని అపహరించిన మహిళను రైల్వే పోలీసులు మూడు గంటల్లోనే పట్టుకున్నారు.

Updated : 01 Oct 2022 08:23 IST

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: తాను తల్లినయ్యానని అబద్ధమాడి.. దాన్ని నిరూపించేందుకు ఓ బాలుడిని అపహరించిన మహిళను రైల్వే పోలీసులు మూడు గంటల్లోనే పట్టుకున్నారు. బాలుడిని కన్నతల్లి ఒడికి చేర్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆర్పీ జిల్లా కార్యాలయంలో రైల్వే సీనియర్‌ సెక్యూరిటీ కమిషనర్‌ దేవస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ శుక్రవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని షోలాపుర్‌కు చెందిన లింగాల సోని (22), రాజు అలియాస్‌ కిట్టు దంపతులు కవాడిగూడ తాళ్లబస్తీలో నివసిస్తున్నారు. వివాహమై మూడేళ్లవుతున్నా తల్లివి కాలేదంటూ ఆమెకు అత్తింట్లో సూటిపోటి మాటలు పెరిగాయి. దీంతో ఆమె 6-7 నెలల కిందట తాను గర్భం దాల్చినట్టు భర్తను నమ్మించి.. ప్రసవానికని పుట్టింటికి వెళ్లింది. అబద్ధాన్ని నిజం చేసేందుకు గురువారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి మాటు వేసింది. శుక్రవారం ఉదయం అక్కడ కర్ణాటకలోని కలబురిగికి చెందిన బి.మంగమ్మ (30) ఏడాది వయసున్న కుమారుడితో కనిపించింది. సోని ఆమె దగ్గరకు వెళ్లి మాట కలిపింది. కాసేపటికి మంగమ్మ టికెట్‌ కోసమని వెళ్తూ.. బిడ్డను సోనికి అప్పగించింది. ఇదే అదనుగా సోని.. ఆ బాలుడిని తీసుకుని మాయమైంది. మంగమ్మ ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు జల్లెడ పట్టారు. నిందితురాలు ఆటోలో ప్రయాణించి, కవాడిగూడలో దిగినట్టు గుర్తించారు. అక్కడ తనిఖీ చేసి, సోనిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని  మంగమ్మకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని