Crime news: చేతులు కట్టేసి.. నోరు బిగించి.. నర్సుపై సామూహిక అత్యాచారం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సుపై ఘోరం జరిగింది. ఆమె ఒంటరిగా పనిచేసుకొంటుండగా లోపలికి చొరబడిన నలుగురు దుండగులు చేతులు కట్టేసి నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగడ్డారు.

Published : 24 Oct 2022 01:19 IST

రాయ్‌పూర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సుపై ఘోరం జరిగింది. ఆమె ఒంటరిగా పనిచేసుకొంటుండగా లోపలికి చొరబడిన నలుగురు దుండగులు చేతులు కట్టేసి నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం గమనార్హం. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. ఒక నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.  ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో మహేంద్రగఢ్‌ జిల్లాలోని చిప్చిపి గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా పనిచేసుకుంటున్న సమయంలో లోపలికి ప్రవేశించిన దుండగులు ఆమె చేతులు కట్టేసి.. అరుపులు వినబడకుండా గట్టిగా నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారని ఆరోపిస్తూ మహిళ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై లైంగిక దాడిని రికార్డు చేశారని.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

మరోవైపు, ఈ ఘటనను భాజపా ఖండించింది. సీఎం భూపేశ్‌ బఘేల్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భాజపా నిరసనలపై మనేంద్రగఢ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ జైశ్వాల్‌ దీటుగా స్పందించారు. ఈ విషయాన్ని భాజపా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తలు రిమోట్‌ గ్రామాల్లో పనిచేసేందుకు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘‘మాకు భద్రత కావాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మేం పనిచేయలేం’’ అని జిల్లా ఆరోగ్య కేంద్రం చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రతిమా సింగ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని