
Crime news: ‘సుప్రీం’ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి
దిల్లీ: గతవారం సుప్రీంకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో శనివారం యువకుడు మరణించగా.. తాజాగా మహిళ కూడా ప్రాణాలు విడిచారు. ఒంటికి నిప్పంటించుకొని 85 శాతం గాయాలపాలైన ఆమె మంగళవారం మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ (24).. తనపై బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ 2019లో అత్యాచారానికి పాల్పడ్డారంటూ కేసు వేసింది. ఆ కేసులో అరెస్టయిన అతుల్‌రాయ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఎంపీకి పోలీసులు సహకరిస్తున్నారని, మరో కేసులో కోర్టు తనకు వారెంటు జారీచేసిందని పేర్కొంటూ తన స్నేహితుడి (27)తో కలిసి సుప్రీంకోర్టు ఆవరణలో ఆమె నిరసనకు దిగారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఫేస్బుక్ లైవ్ వీడియో రికార్డు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. యువకుడు శనివారం మృతిచెందగా.. మహిళ మంగళవారం ప్రాణాలు విడిచినట్టు దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీపక్ యాదవ్ వెల్లడించారు.
అత్యాచారం కేసుకు సంబంధించి తనకు ప్రాణహాని ఉందని.. ఈ కేసును అలహాబాద్ నుంచి దిల్లీకి బదిలీ చేయాలని ఈ ఏడాది మార్చిలో ఆ మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో వయసు వివరాలను ఫోర్జరీ చేశారంటూ వారణాసిలోని ఓ కోర్టు వీరిద్దరికీ నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. తాను తీసిన ఫేస్బుక్ లైవ్‌లోనూ సదరు మహిళ ఈ వారెంటు గురించి ప్రస్తావించారు. ఈ అంశాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.