వరుస పెళ్లిళ్లు..రూ.లక్షల్లో మోసాలు

తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లి కూతరు సుహాసిని కేసు మరో మలుపు తిరిగింది.

Updated : 14 Jun 2021 04:52 IST

వెలుగులోకి మాయ‘లేడీ’ మోసాలు

తిరుపతి: తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లి కూతురు సుహాసిని కేసు మరో మలుపు తిరిగింది. సుహాసిని వల్ల తాను నష్టపోయానంటూ ఆమె రెండో భర్త వినయ్‌ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణలోని కొత్తగూడెంనకు చెందిన వినయ్‌కు 2018లో సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని, ప్రేమించానని చెప్పడంతో 2019లో ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయినట్టు వినయ్‌ వాపోయాడు.

 పెళ్లి చేసుకొన్న కొన్ని రోజులకే ఆమె ప్రవర్తన సరిగా లేకపోగా.. తనకు తెలియకుండా తన బంధువుల నుంచి డబ్బులు తీసుకోవటాన్ని గమనించానని తెలిపాడు. మొదటి భర్త వెంకటేశ్వర్లు, ఆమె ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిపించి బంధువులుగా పరిచయం చేసిందని వివరించాడు. తన బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చిన రూ.10లక్షలతో పాటు తన ఇంట్లో సుమారు రూ.5లక్షల విలువ చేసే బంగారంతో రెండేళ్ల క్రితం  ఇంటి నుంచి పారిపోయిందని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో ఆమె మోసాలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నాడు.  తిరుపతిలో మూడో పెళ్లి చేసుకుని మోసం చేసిన విషయం వెలుగులోకి రావడంతో మీడియా ముందుకు వచ్చానని బాధితుడు వినయ్‌ తెలిపాడు. ఆమె మొదటి భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతోందని, ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోరాడు.

నిత్య పెళ్లికూతురి మోసం వెలుగు చూసిందిలా..
 అలిపిరి ఎస్సై పరమేశ్‌నాయక్‌ కథనం మేరకు.. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు (29) ఐదేళ్లుగా మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తూ తిరుపతి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేసే ఎం.సుహాసిని (35)తో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథని చెప్పడంతో యువకుడు కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే యువతికి 8 తులాల బంగారు నగలు పెట్టారు. ‘నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి ఆరోగ్యం సరిగా లేదు. పెళ్లికి ముందు అప్పులు చేశాను’ అంటూ ఆమె యువకుడి నుంచి వివిధ రూపాల్లో రూ.4 లక్షలు తీసుకుంది. అంతేకాక తన తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుందని తెలియడంతో యువకుడు ఈ నెల 7న ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఇంట్లో యువతి ఆధార్‌కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా.. నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ఈలోగా సుహాసిని ఆ యువకుడికి ఫోన్‌ చేసింది. ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా. త్వరలో నీ డబ్బులు ఇచ్చేస్తా. పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బంది పడతావు’ అని హెచ్చరించింది. ఏడాదిన్నర కిందట రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలనూ యువకుడికి పంపింది. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని