Telangana News: వాహనాల్లో 100 మందితో వచ్చి.. సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మన్నెగూడలో కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని అపహరించిన ఘటన కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 09 Dec 2022 17:32 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మన్నెగూడలో కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని అపహరించిన ఘటన కలకలం రేపింది. డీసీఎం, కార్లలో 100మందికి పైగా యువకులతో వచ్చిన నవీన్‌రెడ్డి  తమ కుమార్తెను తీసుకెళ్లినట్టు దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతులు ఆరోపించారు. ఇంట్లోని సామగ్రి, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు యువతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయినప్పటికీ వేధిస్తున్న నవీన్‌రెడ్డి.. పోలీసుల అండతోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఇంటిపై దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులు, 100 నంబర్‌కు కాల్‌ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు.  పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్‌ రహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో సాగర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 

యువతి అపహరణకు గురైన విషయం తెలుసుకున్న ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. నవీన్‌రెడ్డికి చెందిన టీస్టాల్‌కు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. ఈ ఘటనలతో ఇవాళ మధ్యాహ్నం నుంచి మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో నవీన్‌రెడ్డితో యువతికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని