Murder: అంతా చూస్తుండగానే అంతమొందించారు

భూతగాదాలు యువకుడిని బలిదీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి, అతని ప్రాణం తీశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Updated : 15 Jun 2024 13:46 IST

భూతగాదాలో యువకుడి దారుణ హత్య
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ 
డయల్‌ 100కు ఫోన్‌ చేసినా సకాలంలో స్పందించని పోలీసులు
సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌.. ఎస్సైపై వేటు

పొలం వద్ద సంజప్పపై దాడి చేస్తున్న దాయాదులు

ఊట్కూరు, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: భూతగాదాలు యువకుడిని బలిదీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి, అతని ప్రాణం తీశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం... చిన్నపొర్లకు చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య బాలమ్మ కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప..రెండో భార్య తిమ్మమ్మ కుమారులు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప. లక్ష్మప్ప తనకున్న తొమ్మిదెకరాల భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచారు. పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని పెద్ద భార్య కుమారుడు సంజప్ప కుటుంబ సభ్యులు 2022లో కోర్టును ఆశ్రయించారు. కేసు నడుస్తున్నా... రెండో భార్య కుమారులు పొలాలను సాగు చేస్తుండటంతో సంజప్ప కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సౌరప్ప, ఆయన కుమారుడు సంజప్ప(28)... చిన్న సౌరప్ప, అతని భార్య కవిత గురువారం మధ్యాహ్నం పొలం దున్నేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజప్ప కుటుంబీకులు పొలానికి వెళ్లి వారితో గొడవకు దిగారు. మాటలు పెరగడంతో కర్రలు, రాళ్లతో పెద్ద సౌరప్ప కుమారుడు సంజప్పపై అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితుడిని మొదట నారాయణపేటకు, తర్వాత మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. సంజప్పకు భార్య అనిత, మూడేళ్లలోపు పిల్లలు సాత్విక్, వంశీ ఉన్నారు. సంజప్పను కర్రలతో కొడుతున్న వీడియోలు శుక్రవారం ఉదయం వైరల్‌ కావడంతో పోలీసులు గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. నిందితులు గుట్టప్ప, ఆశప్ప, చిన్న వెంకటప్ప, ఆటో సంజీవ్, శ్రీను, కిష్టప్ప, నట్టలప్పలపై కేసులు నమోదు చేశారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌.ఐ. బి.శ్రీనివాస్‌ వివరించారు. 

ఊట్కూరు ఎస్సై సస్పెన్షన్‌ 

దాడిపై తాము డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు రెండు గంటల తర్వాత వచ్చారని సంజప్ప చిన్నమ్మ కవిత ఆరోపించారు. ఠాణా నుంచి ఘటనాస్థలి 15 కి.మీ.లోపే ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఊట్కూరు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అక్కడి పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. దాంతో సంజప్ప హత్య ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు ఊట్కూరు ఎస్సై బి.శ్రీనివాస్‌ను ఐజీ సుధీర్‌బాబు ఆదేశంతో సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. 

త్వరగా తరలిస్తే ప్రాణం దక్కేదేమో...!

ఘటనాస్థలం నుంచి సంజప్పను ఆటో, ట్రాక్టర్లలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు భయం కారణంగా ఊర్లో ఎవ్వరూ ముందుకు రాలేదని, ఊట్కూరులోని ఠాణాకు వెళ్లి సమాచారమిచ్చినా పోలీసులు స్పందించలేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు 108 అంబులెన్స్‌ ఊట్కూరు వరకు వచ్చినా బురద కారణంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఓ మాజీ ప్రజాప్రతినిధి తన ట్రాక్టరును పంపించగా... సంజప్పను ఊర్లోకి తీసుకొచ్చి, 108లో నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతే పోలీసులు తాపీగా వచ్చినట్లు చెబుతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఉంటే... సంజప్ప బతికి ఉండేవారనే వాదన వినిపిస్తోంది. 

పెద్దపల్లి ఘటనపైనా...  

పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపైనా సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని