Nidhivan Raj: వద్దంటే వీడియో తీసి జైలుపాలయ్యాడు!

తమ ఫాలోవర్స్‌కి కొత్తగా ఏదైనా చూపించాలన్న కాంక్షతో యూట్యూబర్లు కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్‌ ఇలాగే ఓ పవిత్రమైన ప్రదేశంలో అనుమతి లేకుండా వీడియోలు తీసి.. పండితుల ఆందోళనకు కారణమయ్యాడు. వారి

Published : 16 Nov 2021 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ ఫాలోవర్స్‌కి కొత్తగా ఏదైనా చూపించాలన్న కాంక్షతో యూట్యూబర్లు కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్‌ ఇలాగే ఓ పవిత్రమైన ప్రదేశంలో అనుమతి లేకుండా వీడియోలు తీసి.. పండితుల ఆందోళనకు కారణమయ్యాడు. వారి ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..

దిల్లీకి చెందిన గౌవర్‌ శర్మకు ‘గౌరవ్‌ జోన్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. వినూత్న వీడియోలు తీసి అందులో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి ‘నిధివన్‌ రాజ్‌’ గురించి తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బృందావన్‌ ప్రాంతంలోని చిన్న అటవీ ప్రాంతమే ‘నిధివన్‌ రాజ్‌’. ఇక్కడ రాత్రుళ్లు శ్రీకృష్ణుడు, ఆయన ప్రేయసి రాధ ఏకాంతంగా గడుపుతుంటారని, నృత్యాలు చేస్తారని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే రాత్రుళ్లు ‘నిధివన్‌ రాజ్‌’లోకి ఎవరినీ అనుమతించరు. దీంతో రాత్రి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భావించిన గౌరవ్‌ నవంబర్‌ 6వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి ‘నిధివన్‌ రాజ్‌’లోకి చొరబడి వీడియోలు తీశాడు. నవంబర్‌ 9న ఈ వీడియోని తన ఛానెల్‌లో ప్రసారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పండితులు గౌరవ్‌ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రాంతంలో అపచారానికి ఒడిగట్టాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ విషయం వివాదంగా మారుతోందని తెలుసుకున్న గౌరవ్‌ ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించాడు. అయినా.. పండితులు అతడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దిల్లీలో గౌరవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. 

గౌరవ్‌పై కేసు ఇది తొలిసారేం కాదు.. గతంలోనూ శునకం మెడకు హీలియం గ్యాస్‌ బెలూన్లను కట్టి గాల్లోకి వదిలేశాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు గౌరవ్‌ ఆ వీడియోను తొలగించి.. నెటిజన్లకు క్షమాపణ చెబుతూ మరో వీడియోను అప్‌లోడ్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని