Andhra News: వైఎస్‌ కొండారెడ్డి జిల్లా బహిష్కరణకు చర్యలు.. కలెక్టర్‌కు ఎస్పీ ప్రతిపాదనలు

ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టైన వైఎస్‌ కొండారెడ్డి ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యారు. సీఎం జగన్‌ ఆదేశాలతో కడప పోలీసులు కొండారెడ్డిని అరెస్టు

Published : 12 May 2022 01:40 IST

కడప: ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టైన వైఎస్‌ కొండారెడ్డి ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యారు. సీఎం జగన్‌ ఆదేశాలతో కడప పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బహిష్కరణపై జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బెదిరిస్తే 100, 14400, 94407-96900 నంబర్లను సంప్రదించి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

అసలేం జరిగింది.. 

నంద్యాల జిల్లా చాగలమర్రి- అన్నమయ్య జిల్లా రాయచోటి మధ్య 143 కిలోమీటర్ల... రహదారులు, భవనాల శాఖ రహదారిని కేంద్రం నేషనల్‌ హైవేగా గుర్తించి రూ.350 కోట్లు కేటాయించింది. గుత్తేదారు రవికుమార్‌రెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ 30 శాతం లెస్‌తో టెండరు దక్కించుకుని పనులు చేపట్టింది. చక్రాయపేట పరిధిలో 4 కి.మీ. పొడవున్న రహదారి పనుల్లో తనకు భాగస్వామ్యం వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జి, సీఎం జగన్‌ బంధువు వైఎస్‌ కొండారెడ్డి డిమాండు చేశాడు. లేదంటే పనులు జరగనివ్వనని బెదిరించాడు. ఈ వ్యవహారం గుత్తేదారు వియ్యంకుడు, కర్ణాటక మంత్రి శ్రీరాములు వరకు వెళ్లింది. ఆయన దిల్లీలోని భాజపా అగ్రనేతలకు పరిస్థితిని తెలపగా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉదంతంలో కదలిక వచ్చింది. కొండారెడ్డిని అరెస్టు చేయాలని సీఎం జగన్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా పోలీసులు ఆదివారమే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అధికారికంగా అరెస్టు చూపి, రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని