Ongole: నడిరోడ్డుపై లారీతో ఢీకొట్టి వైకాపా నాయకుడి దారుణ హత్య

పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేసిన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

Updated : 23 Sep 2022 07:40 IST

 పార్టీలోని మరో వర్గం దుశ్చర్య  

మండల ఉపాధ్యక్ష పదవి విషయంలో విభేదాలే కారణం! 

సింగరాయకొండ గ్రామీణం, ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేసిన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పసుపులేటి రవితేజ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పార్టీలోని మరో వర్గంతో విభేదాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రవితేజ, అతడి మిత్రుడు ఉమ వేర్వేరు ద్విచక్ర వాహనాలపై రాత్రి 8.30 గంటల సమయంలో కనుమళ్లకు వస్తుండగా వెనుక నుంచి లారీతో అతడిని ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మిత్రుడు ఉమ దానిని వెంబడించి ఆపడానికి ప్రయత్నించాడు. అతనిపైకి కూడా లారీని పోనిచ్చేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా కొద్దిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. రవితేజ మూలగుంటపాడులో ఉంటూ అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సింగరాయకొండ మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం ఉందని స్థానికులు తెలిపారు. హత్యకు అదే కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ హత్య అనంతరం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి అదనపు బలగాలు రప్పించి గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని