Guntur: దోమలపై ఫిర్యాదు చేసినందుకు.. వైకాపా సర్పంచి భర్త దాడి

గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని.. చర్యలు తీసుకోవాలని 1902కు ఫిర్యాదు చేసిన వ్యక్తిని అధికార పార్టీ నాయకుడు, సర్పంచి భర్త దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు.

Updated : 12 Nov 2022 08:40 IST

గుంటూరు, న్యూస్‌టుడే: గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని.. చర్యలు తీసుకోవాలని 1902కు ఫిర్యాదు చేసిన వ్యక్తిని అధికార పార్టీ నాయకుడు, సర్పంచి భర్త దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌కు చెందిన పిల్లుట్ల బాబూరావు గ్రామంలో దోమల బెడద ఉందని టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది స్పందించి మురుగు తొలగించారు. ఫొటో తీసి ఉన్నతాధికారులకు తాము పంపించాలని, మురుగు తొలగించిన ప్రదేశం వద్దకు రావాలని ఫిర్యాదుదారుకు సిబ్బంది సూచించినప్పటికీ వెళ్లలేదు. విషయం గ్రామంలోని అధికార పార్టీ నాయకుల దృష్టికి వెళ్లింది. గురువారం గ్రామంలోని నేతలు, ఫిర్యాదుదారు పంచాయతీ కార్యాలయం వద్ద కలుసుకున్నప్పుడు దీనిపై వాగ్వాదమేర్పడింది. ఈ సమయంలో బాబూరావుపై వైకాపా నాయకుడు, గ్రామ సర్పంచి భర్త ఆనంద్‌ దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారని గ్రామస్థులు వివరిస్తున్నారు. ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు బాబూరావు గుంటూరుకు వెళ్లారు. కలెక్టరేట్‌లో ‘స్పందన’లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లి అక్కడ స్పృహ తప్పారు. ఆయన్ను 108 వాహనంలో గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. వైకాపా నాయకుడు ఆనంద్‌పై బాధితుడు బాబూరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని