‘నా భర్తను నేనే కాల్చి చంపేదానిని’

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. దుబే చేసిన దారుణాలపై అతడి భార్య రిచా దుబే తొలిసారిగా మీడియా ముందు స్పందించారు.

Updated : 24 Jul 2020 13:00 IST

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే భార్య రిచా దుబే

లఖ్‌నవూ : కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. దుబే చేసిన దారుణాలపై అతడి భార్య రిచా దుబే తొలిసారిగా మీడియా ముందు స్పందించారు. అతడు చేసిన దారుణాలను ఎప్పటికీ క్షమించలేనని అన్నారు.

‘అతడు ఎనిమిది మంది పోలీసు కుటుంబాలను నాశనం చేశాడు. మేం మా ముఖాలను బహిరంగంగా చూపించలేం. పోలీసుల పట్ల నా భర్త చేసిన దారుణాలకు నేనే అతడిని కాల్చి చంపేదానిని’ అని రిచా దుబే అన్నారు.

ఆ రోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ..‘జులై 3న తెల్లవారుజామున  వికాస్‌ దుబే నాకు ఫోన్‌ చేశాడు. పోలీసులపై దాడి జరుగుతోందని.. పిల్లలను తీసుకుని బిక్రూ గ్రామాన్ని వదిలివెళ్లాలని కోరాడు. అయితే నేను వీటన్నింటితో విసిగిపోయాను అని చెప్పి ఫోన్‌ పెట్టేశాను.’ అని చెప్పారు. 

‘వికాస్‌ పని గురించి, అతడి స్నేహితుల గురించి నాకు చాలా తక్కువ తెలుసు. ఈ ఘటన తర్వాత లఖ్‌నవూలోని శిథిలమైన భవనంలో ఒక వారం గడిపాను. నేను నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాను. అత్తమామల నుంచి లేదా నా కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభించదని నాకు తెలుసు’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

‘వికాస్‌ గతంలో ఓ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడి మెదడులో ఏదో సమస్య తలెత్తింది. ఫలితంగా ఎప్పుడూ ఆందోళన, కొపంతో కనిపించేవాడు. దీనికి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే 4 నెలల నుంచి ఆ చికిత్స ఆగిపోయింది. దీంతో అతడిలో కోపం మరింత పెరిగింది.’ అని రిచా వివరించారు.

తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8 మంది పోలీసులను ఒక పథకం ప్రకారం దారుణంగా కాల్చి చంపించిన ఈ గ్యాంగ్‌స్టర్‌ను  జులై 10న కాన్పుర్‌ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని విపక్షాలు విమర్శించిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఏక సభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని