logo

కిడ్నీలకు.. కష్టం

మారుతున్న జీవనశైలితో మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు తదితర సమస్యలు మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతున్నాయి. గ్రేటర్‌లో వారానికి 30-40 వేల డయాలసిస్‌లు జరుగుతున్నాయి.

Published : 10 Mar 2022 03:21 IST

గ్రేటర్‌లో వారానికి 40 వేల వరకు డయాలసిస్‌లు

ఏటా పెరుగుతున్న బాధితులు

నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

మారుతున్న జీవనశైలితో మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు తదితర సమస్యలు మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతున్నాయి. గ్రేటర్‌లో వారానికి 30-40 వేల డయాలసిస్‌లు జరుగుతున్నాయి. నిమ్స్‌ ఆసుపత్రిలో ఇప్పటికే 3500 పైనే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. మరో 5 వేల మంది జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ వ్యాధి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే చాలామందిలో ముప్పు తీసుకొస్తోంది. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కథనం...

రక్తంలోకి చేరిన వ్యర్థాలను వడకడుతూ...ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కిడ్నీలది. జన్యుపరమైన కారణాలతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం తదితర కారణాలతో కిడ్నీ జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒకసారి మూత్ర పిండం పనితీరు మందగించి అది విఫలమవటం ప్రారంభమైతే పూర్తిగా నయం చేయడం కష్టం. పైగా చికిత్సకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించడం కూడా కష్టమే. ముందే అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పొగతాగడం ఇతరత్రా కారణాలతో ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలకు దారి తీస్తోంది. చివరికి ఇవి కిడ్నీ వ్యాధులకు కారణమవుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30 శాతం, టైప్‌-2 మధుమేహ బాధితుల్లో 40 శాతం మంది కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. సమస్యను తొలి దశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది.

- ఈనాడు, హైదరాబాద్‌

మార్పిడి తర్వాత వివాహం చేసుకున్నా

2003లో ఈ సమస్యతో మా చెల్లెలు చనిపోయింది. 2006లో నాకూ ఇబ్బంది తలెత్తింది. 2012లో మా పిన్ని నాకు కిడ్నీ దానం చేసి మరో జన్మ ప్రసాదించారు. తర్వాత నేను వివాహం చేసుకున్నా. మాకు ఒక పాప. ఉద్యోగం కూడా చేస్తున్నా. నాలాంటి వారికి ధైర్యం కల్పించడానికి ఒక సామాజిక మాధ్యమంలో వేదిక ఏర్పాటు చేశా. ప్రస్తుతం అందులో వేయిమంది ఉన్నారు. రోగులకు ప్రభుత్వం నుంచి పింఛను లాంటివి మంజూరు చేయాలి.

- భగవాన్‌రెడ్డి, చేయూత ఫౌండేషన్‌


భార్య కిడ్నీ దానంతో జీవం పోసుకున్న భర్త

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: ఎల్బీనగర్‌లో డా.మనోహరన్‌(64), జయలలిత(54) దంపతులు నివాసముంటున్నారు. ఆయన ఎస్‌బీఐలో చీఫ్‌ మేనేజరుగా 2014లో పదవీ విరమణ పొందారు. డీఆర్‌డీఎల్‌లో డా.అబ్దుల్‌ కలాంతో పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత బ్యాంకులో ఉద్యోగిగా చేరారు. 1994లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆ సమయంలో వైద్యులు కిడ్నీ మార్పిడి చేస్తేనే బతుకుతారని చెప్పడంతో దాత కోసం వెతికారు. తనకు సరిపడేది ఎవరి వద్ద లభించలేదు. చివరకు ప్రేమించి వివాహం చేసుకున్న భార్య ఆదుకున్నారు. ఆమె కిడ్నీ దానం చేయడంతో జూబ్లిహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో 1994లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. భార్యభర్తలు ఇద్దరూ నేటికి ఆరోగ్యంగా ఉన్నారు.


నిరంతర అప్రమత్తత అవసరం

నిరంతర అప్రమత్తతతో కిడ్నీ జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్ఛు అధిక రక్తపోటు, మధుమేహం రోగులు కనీసం మూడు నెలలకు ఒకసారైనా పరీక్షలు చేసుకోవాలి. అతి తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నట్లు తేలింది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇక పెద్ద వాళ్లు సైతం మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యుల సూచనలు లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు.

- డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు, మూత్రపిండ నిపుణులు, నిమ్స్‌


 

ఇవి గమనిస్తున్నారా...

మూత్రంలో ఆల్బుమిన్‌ ఎక్కువగా పోతుంటే అప్రమత్తం కావాలి. ఇది ఒక రకం ప్రోటీన్‌. సుద్దలా ఉంటుంది. ఇది ఎక్కువగా పోతుంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతున్నట్టే. రక్తంలో సీరమ్‌ క్రియాటిన్‌ మాత్రమే కాకుండా ఎస్టిమేటడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌(ఈజీఎఫ్‌ఆర్‌) లెక్కించాలి. ఇది 110 మిల్లీ వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కంటే తగ్గితే సమస్య ఉన్నట్లే. మధుమేహం ఉంటే హెచ్‌బీఏ1సీ 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ 130/80 దాటకుంటే ఉత్తమం.

-డా.అరవింద్‌రెడ్డి, నెఫ్రాలజిస్టు, నిమ్స్‌ మనోహరన్‌, జయలలిత


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని