Crime News: తిరిగిస్తే ఇచ్చినట్లు.. లేదంటే పోయినట్లే!

అగ్ర కథానాయకులతో పరిచయాలు. సినీ పరిశ్రమలో నిర్మాతగా సినిమాలు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సంబంధాలు.. గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన తెల్లా శిల్పాచౌదరి, శ్రీనివాస్‌ కృష్ణప్రసాద్‌ దంపతుల మాయలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 29 Nov 2021 07:04 IST

అప్పు తీర్చమని అడిగితే అంతుచూస్తామని బెదిరింపులు 

వెలుగులోకి శిల్పాచౌదరి దంపతుల అరాచకాలు 

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, నార్సింగి: అగ్ర కథానాయకులతో పరిచయాలు. సినీ పరిశ్రమలో నిర్మాతగా సినిమాలు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సంబంధాలు.. గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన తెల్లా శిల్పాచౌదరి, శ్రీనివాస్‌ కృష్ణప్రసాద్‌ దంపతుల మాయలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కనుసైగ చేస్తే అడ్రస్‌ కూడా మిగలదంటూ చేసిన బెదిరింపుల పర్వం బయటపడుతోంది. కోట్లాది రూపాయలు మోసం చేసిన కేసులో నార్సింగి పోలీసులు వీరిని అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ప్రియ అనే బాధితురాలు శిల్పాచౌదరికి తాను రూ.2 కోట్లు ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. మరో ఆరుగురు బాధితులు వివిధ ఠాణాలను ఆశ్రయించినట్టు సమాచారం. వీరిలో ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావటంతో నార్సింగి పోలీసులు వారి పరిధిలో ఫిర్యాదు చేయమని సూచించినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో బాధితులున్నా సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావటంతో పరువు పోతుందనే ఉద్దేశంతో వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. గతేడాది శిల్పాచౌదరి, ప్రముఖ రాజకీయ నాయకుడి మేనల్లుడు నిర్మాతలుగా సెహరి అనే సినిమాను నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దీని టీజర్‌ విడుదల చేసినా, వివాదాల నేపథ్యంలో విడుదల నిలిచిపోయింది. 


రిసార్ట్‌ల్లో ఖరీదైన పార్టీలు 

శిల్పాచౌదరి దూరవిద్యలో డిగ్రీ చేశారు. గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాల్లో ఖరీదైన భవనం కొనుగోలు చేసి ఉంటున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్టుగా కార్యాలయం ప్రారంభించారు. వ్యాపారంలో భాగస్థులు/పెట్టుబడి పెట్టే వారిని ఆకర్షించేందుకు పెద్దఎత్తున విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ప్రముఖ రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌ల్లో ఏర్పాటు చేసే థీమ్‌పార్టీలకు సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపేవారు. ప్రత్యేక ఆకర్షణ, హోదాగా కనిపించేందుకు ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి హాజరయ్యేవారు. అతిథులకు ఖరీదైన మద్యం, రుచికరమైన ఆహార పదార్థాలను అందించేవారు. ఒక్కో మద్యం సీసాను రూ.2-3 లక్షల వరకూ కొనుగోలు చేసి విందు, వినోదాల్లో అందించేవారంటే ఏ స్థాయిలో ఖర్చు చేస్తారనేది అర్థం చేసుకోవచ్చు. సినీతారలు హాజరైన విందు పార్టీ కోసం రూ.50 లక్షలు వెచ్చించినట్టు తెలిసింది. అక్కడకు వచ్చిన మహిళలకు లాభాలను ఆశగా చూపారు. వ్యాపారాల్లో పెట్టుబడితో వడ్డీలు/లాభాలు వచ్చేలా చేస్తానంటూ పెద్దఎత్తున వసూలు చేయటం, సమయానికి ఇవ్వకపోతే బ్యాంకు చెక్‌లిచ్చి తప్పించుకునేవారు. ఈ తరహాలో రూ.70-80 కోట్ల వరకూ వసూలు చేసి ఉండవచ్చని అంచనా వేశారు. 


ఐపీఎస్‌ల పేరు చెప్పి.. 

భర్త, స్నేహితుల నుంచి తీసుకుని పెట్టుబడిగా ఇచ్చిన సొమ్ము తిరిగివ్వమంటూ డిమాండ్‌ చేసే మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించేవారు. శిల్పాచౌదరి భర్త శ్రీనివాస్‌ కృష్ణప్రసాద్‌ తనకు ఐపీఎస్‌ అధికారులతో సంబంధాలున్నాయంటూ చెప్పేవాడు. వారితో మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ఓ బాధితురాలు పోలీసుల వద్ద మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులు రాణా, సందీప్‌ కోసం వెతుకుతున్నారు. నిందితులను కస్టడీకి కోరుతూ సోమవారం న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ దంపతుల చేతిలో మోసపోయిన బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. బాధితుల్లో సినీరంగ ప్రముఖులు ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదని పేర్కొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని