logo

హెచ్‌ఎండీఏలో.. అమ్మో.. అక్రమార్కులు!

మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు

Published : 24 Jan 2022 01:43 IST

అనుమతి లేని ఇళ్ల నుంచి పన్నుల వసూలు

భవనాల కూల్చివేతల్లో వెలుగులోకి వాస్తవాలు

4 జోన్ల పరిధిలో 40 మందిపై చర్యలకు సిద్ధం

దూలపల్లిలో అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీలు చేసి, అతిక్రమణలు లేకుంటే నివాసయోగ్య పత్రం జారీ చేస్తారు. అప్పుడే ఎంత పన్ను అనేది నిర్ణయిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నట్లు తేలింది. అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించగా, వాటికే పన్ను వసూలు చేయడం విస్తు గొలుపుతోంది. తాజాగా మేడ్చల్‌ జోన్‌లో చేపట్టిన కూల్చివేతల్లో ఈ తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జోన్‌లోని నాలుగు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో ఇలాంటి భవనాలున్నట్లు తెలుస్తోంది. ఇతర జోన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరానికి పక్కనే ఉన్న మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ భవనాలు వెలిశాయి. కొన్ని రోజులుగా హెచ్‌ఎండీఏ స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ సిబ్బందితో కలిపి వీటిని గుర్తించే పనిలో పడింది. ఇప్పటివరకు 600 చదరపు గజాలు ఆపై ఉన్న భవనాలను 200వరకు గుర్తించారు. ఇందులో 60కి పైగా భవనాలను సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. జీప్లస్‌ 2 నిర్మాణాలకు సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు ఇస్తాయి. అంతకు మించితే హెచ్‌ఎండీఏలో దరఖాస్తు చేసుకోవాలి. చాలామంది జీప్లస్‌2కే అనుమతి తీసుకొని అయిదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. 600 గజాలు ఆపైన స్థలాల్లో అనుమతులు లేకుండా భారీ షెడ్లు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించి వాటిని విక్రయించి ప్రజలను  మోసగిస్తున్నారు. 


 

ఇంటి దొంగల హస్తంపై ఆరా

హెచ్‌ఎండీఏ పరిధిలో మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, శంకర్‌పల్లి, శంషాబాద్‌ జోన్లు ఉన్నాయి. ఇక్కడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళి విభాగాలు అవినీతి నిలయాలుగా మారాయనటానికి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలే నిరద్శనంగా నిలుస్తున్నాయి.
ఈ నాలుగు జోన్ల పరిధిలో తొలి విడతలో 600 గజాలు ఆపైన అక్రమ నిర్మాణాలను 200 వరకు హెచ్‌ఎండీఏ గుర్తించింది. మరో 600 వరకు ఈ తరహా భవనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
నగరాన్ని ఆనుకుని ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండటంతో స్థలాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకొని వెంచర్లు, నిర్మాణాలు చేపట్టాలంటే లేఅవుట్‌ రుసుంలు, అభివృద్ధి ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించాలి. నిర్మాణాలు పూర్తయ్యే వరకు హెచ్‌ఎండీఏ వద్ద స్థలాలు, లేదా ఫ్లాట్లు తనఖా పెట్టాలి. కొందరు ఈ నిబంధనలు పాటించక కుండా అక్రమ పద్ధతులను ఎంచుకుంటున్నారు.
నాలుగు జోన్లలో భారీగా అక్రమ భవనాలు రావడంలో స్థానిక పట్టణ ప్రణాళిక విభాగం హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. స్తిరాస్థి వ్యాపారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కై వాటాలు తీసుకొని అక్రమ భవనాలను ప్రోత్సహిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది.
మేడ్చల్‌లో తాజాగా పలు భవనాలకు అక్రమంగా ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య(పీటీఐఎన్‌)నెంబర్లు కేటాయించి ఆస్తి పన్నులు సైతం వసూలు చేస్తున్న వైనం ఓ ఉన్నతాధికారి దృష్టికి వచ్చింది. సంబంధిత ఉద్యోగిని పిలిచి ప్రశ్నించారు. ఆ భవనాలను ఉన్నతాధికారి సీజ్‌ చేయించారు.  
ఇలా నాలుగు జోన్ల పరిధిలో దాదాపు 40-50 పట్టణ ప్రణాళిక సిబ్బంది హస్తంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో భవనం నుంచి లక్షల్లోనే వసూలు చేసి పంచుకున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
క్షేత్రస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని