logo

గాంధీలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం చకచకా

ఎంతోకాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన గాంధీఆసుపత్రి ప్రాంగణంలో మాతా, శిశు (ఎంసీహెచ్‌) కేంద్రం భవనం నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2018లోనే బీజం పడింది. రెండు అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదన ఉన్నా, రోగుల తాకిడికి సరిపోవనే ఉద్దేశంతో తాజాగా ఐదు అంతస్తులతో నిర్మిస్తున్నారు...

Published : 24 Jan 2022 01:47 IST

రూ.50 కోట్లతో వేగంగా పనులు

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: ఎంతోకాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన గాంధీఆసుపత్రి ప్రాంగణంలో మాతా, శిశు (ఎంసీహెచ్‌) కేంద్రం భవనం నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2018లోనే బీజం పడింది. రెండు అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదన ఉన్నా, రోగుల తాకిడికి సరిపోవనే ఉద్దేశంతో తాజాగా ఐదు అంతస్తులతో నిర్మిస్తున్నారు.  

200 పడకలతో.. మాతా, శిశు ఆరోగ్యకేంద్రంలో ప్రస్తుతం 200 పడకలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.  ఆసుపత్రిలోని గైనకాలజీ, పీడియాట్రిక్‌ వార్డులను ఇందులోకి మార్చుతారు. ఇప్పటికే ఆస్పత్రిలో చిన్నారులు 200 మంది, గర్భిణులు, బాలింతలు మరో 200 మంది ఉంటున్నారు. వీరందరినీ ఒకే చోటుకు చేర్చాలంటే 400 పడకలు అవసరం. ఆ రెండు విభాగాలు కొత్త భవనంలోకి మార్చిన తర్వాత రద్దీ ఎక్కువగా, పడకలు తక్కువగా ఉన్న న్యూరాలజీ, యూరాలజీ పడకలను వాటిల్లో సర్దుబాటు చేస్తారు. ప్రధానాసుపత్రి భవనానికి అన్నీ దగ్గరగా ఉండేలా ప్రస్తుత స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ కేంద్రం గేటు నేరుగా ప్రధాన దారివైపు వస్తుంది. తద్వారా గర్భిణులు, పిల్లలను మరింత త్వరగా చేర్చుకునే వీలుంటుంది. ఓపీలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లేబొరేటరీ అందుబాటులో ఉంటుంది. అత్యవసర రోగులొస్తే పక్కనున్న భవనంలోని మూడో అంతస్తులో  65 పడకల ఐసీయూ ఉంది. ఎమర్జెన్సీ నుంచి రోగులను నేరుగా కేంద్రంలోకి తీసుకొచ్చేలా స్కైవాక్‌లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎంసీహెచ్‌ భవనాన్ని నిర్మిస్తున్న స్థలంలో రోగుల సహాయకుల కోసం వసతి గృహం ఉండేది. ప్రస్తుతం దాన్ని తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారు.


ఎంసీహెచ్‌ ఎంతో ఉపయుక్తం
ఎం.రాజారావు, సూపరింటెండెంట్‌

మాతా, శిశు ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో నిర్ణీత పడకలున్నా రద్దీ ఎక్కువైన సమయంలో అనేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈ కేంద్రం రావడంతో పిల్లలు, తల్లులు ఒకే ప్రాంగణంలో ఉండడంతో ఎంతో వెసులుబాటుగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని