logo

అయ్యో. శిరీషా.. ఎంత కష్టమొచ్చె!

రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం వారిది.. ఉన్న ఒక్క ఎకరం భూమిలోనే వరి పండించుకొని కూలీ, నాలీ చేస్తే గానీ కుటుంబపోషణ గడవని దయనీయ పరిస్థితి

Updated : 18 Jul 2021 12:59 IST

సాయం కోసం విద్యార్థిని వేడుకోలు

ఏడాదిగా మంచానికే పరిమితం

కౌటాల గ్రామీణం, న్యూస్‌టుడేః రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం వారిది.. ఉన్న ఒక్క ఎకరం భూమిలోనే వరి పండించుకొని కూలీ, నాలీ చేస్తే గానీ కుటుంబపోషణ గడవని దయనీయ పరిస్థితి వారిది. తమ పిల్లలను ప్రయోజకులను చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులకు తమ కళ్లముందే అమ్మాయి వింత వ్యాధితో జీవచ్ఛవంలా పడి ఉండడం తీరని దుఖాన్ని మిగుల్చుతోంది. కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన గాడి దుర్గయ్య, చంద్రకళకు నలుగురు సంతానం. రెండో కుమార్తె శిరీష కౌటాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసింది. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో శిరీషకు జ్వరం రావడంతో కుటుంబీకులు ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చూపించారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆమె తలపై ఉన్న వెంట్రుకలు ఊడిపోవడం, చర్మంపై పుండ్లు, మోకాళ్లు, మోచేతులు ఎర్రబారిపోవడంతో పాటు శిరీషను చూస్తేనే భయమేసే విధంగా మారడంతో తండ్రి దుర్గయ్య రూ.50వేలు అప్పుచేసి బిడ్డను కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు శిరీషకు లుపీస్‌ వ్యాధి అని నిర్ధారించారు. అయితే రోజురోజుకు శిరీష పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మంచం దిగి కింద అడుగువేయలేని పరిస్థితి. ఒళ్లంతా పుండ్లు, నొప్పులతో బాధపడుతున్న తమ బిడ్డ కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అన్నీ పనులు మరిచి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని