TS News: సరస్వతి కరుణించినా.. లక్ష్మి కటాక్షించలే
చేనులో పత్తి ఏరుతూ..
అక్షరాలు రాని తల్లిదండ్రులు అనుకూలించని పరిసరాలు రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు అయినా.. స్టెతస్కోప్ ధరించాలనుకుంది చేనులో పత్తి ఏరింది కష్టాలను అధిగమించింది చదువుపై శ్రద్ధ చూపింది నీట్లో సత్తా చాటింది నేడు ఆర్థికసాయానికై ఎదురుచూస్తోంది’ పేదింటి విద్యార్థిని మమత.
కాగజ్‌నగర్ గ్రామీణం/రెబ్బెన, న్యూస్‌టుడే: నిరుపేద, నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం. అయితేనేం కష్టపడి చదివింది.. ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. ఏకంగా అఖిలభారతస్థాయి నీట్ పరీక్షలో తన ప్రతిభను చూపింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎంబీబీఎస్ ప్రవేశానికి చేతిలో చిల్లిగవ్వలేక ఆవేదన చెందుతోంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోన్న కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి మమత దీనస్థితిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.
* తుంగెడకు చెందిన డోంగ్రి కిష్టయ్య-ఈశ్వరి దంపతుల కుమార్తె మమత. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. 5 నుంచి 8వ తరగతి వరకు సిర్పూర్(టి) గురుకుల పాఠశాలలో అభ్యసించింది. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కరీంనగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చదివింది. పదో తరగతిలో తొమ్మిది జీపీఏ సాధించిన ఈ విద్యార్థిని ఇంటర్మీడియట్లో వెయ్యి మార్కులకు గానూ 962 సాధించింది. 16 లక్షల మందికి పైనే రాసిన నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 512 మార్కులు సాధించి అఖిలభారత స్థాయిలో ఎస్సీ కేటగిరీలో 2000 ర్యాంకుతో సత్తా చాటింది. ఒకవైపు చదువుకుంటూనే సెలవు దినాల్లో సొంతూరిలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది. ఎంబీబీఎస్‌లో సీటు వస్తుందనే భరోసా ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వలేక ఏం చేయాలో తెలియక సరస్వతీ పుత్రిక అయోమయంలో పడింది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబానికి ఎలాంటి స్థిర, చరాస్తులు లేవు. కనీసం ఎక్కడికి వెళ్లాలన్నా ఛార్జీలకు నయా పైసా లేక ఏమిచేయాలో తెలియక కుటుంబసభ్యులతోపాటూ సదరు విద్యార్థిని మదనపడుతోంది. డాక్టర్ కావాలనే కలలు కన్న ఈ యువతి సీటు సాధించినప్పటికీ ఆర్థిక పరిస్థితి అడ్డుగా మారింది.
తల్లిదండ్రులతో మమత
స్త్రీవైద్య నిపుణురాలు కావాలని ఉంది : - డోంగ్రి మమత, తుంగెడ
సమాజంలో ఎందరో పేద మహిళలు ప్రసూతీలకు అప్పులు చేసి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్త్రీవైద్య నిపుణురాలిగా పేద మహిళలకు సేవలందిస్తా. మారుమూల గ్రామం నుంచి కష్టపడి సీటు సంపాదించినప్పటికీ పేద కుటుంబం కావడంతో చేతిలో చిల్లిగవ్వలేక బాధపడుతున్నా. మాకు ఎలాంటి ఆస్తులు కూడా లేవు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతోనే కుటుంబం నడుస్తోంది. మానవతావాదులు నాకు ఆర్థికంగా సాయం చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటా.