logo
Published : 03/12/2021 03:52 IST

బజారుకెళితే బేజారె !

● పాదబాటల ఆక్రమణలు, అడ్డదిడ్డంగా వాహనాలు

న్యూస్‌టుడే, కైలాస్‌నగర్‌


శివాజీచౌక్‌ సమీపంలో పెద్ద కూరగాయల మార్కెట్‌కు వెళ్లేందుకు వదిలిపెట్టిన దారి ఇది. బండ్లు నిలిపేందుకు స్థలం లేక మధ్యలో వాహనాలను పార్కింగ్‌ చేసి రోడ్డును బ్లాక్‌ చేశారు.

 
అంబేడ్కర్‌ చౌక్‌ సమీపంలో మ్యాచింగ్‌ సెంటర్ల వద్ద రోడ్లపై వాహనాలు పెట్టడంతో ఇక్కడ రాకపోకలకు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
 

ఇది పట్టణంలోని అంబేడ్కర్‌ చౌక్‌ నుంచి గాంధీచౌక్‌కు వెళ్లే దారి. రెండు కూడళ్ల మధ్య దూరం దాదాపు 150 మీటర్లు. వాహనంపై వెళ్తే నిమిషం కూడా పట్టదు. రోడ్లపైనే వ్యాపారాలు పెట్టుకోవడం, ఫుట్‌పాత్‌ను ఆక్రమించడంతో ఈ దారి మీదుగా బండి వెళ్లాలంటే అయిదు నిమిషాలకు పైనే అవుతోంది. ఇక్కడ ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొనడం, పాదచారులు గాయాల పాలవడం సాధారణంగా మారింది.

పట్టణాన్ని సూచిస్తున్న ఈ గూగుల్‌ మ్యాపులో ఎరుపు గీత ఉన్న దారులు మార్కెట్‌ యార్డు నుంచి దేవీచంద్‌చౌక్‌, వివేకానంద చౌక్‌ నుంచి ఠాకూర్‌ హోటల్‌, ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి వినాయక్‌చౌక్‌, అశోక్‌రోడ్డు ప్రాంతాలను సూచిస్తున్నాయి. అశోక్‌రోడ్డు తప్ప మిగితా రోడ్లు విశాలంగా ఉన్నా ఆక్రమణలతో ఇరుకుగా మారాయి. వాహనదారులు రోడ్లపైనే పార్కింగ్‌ చేయాల్సి రావడంతో రాకపోకలకు ఆటంకాలు తప్పడం లేదు.

పట్టణ జనాభా ఏటా పెరుగుతోంది. వాహనాల కొనుగోళ్లు, వినియోగం సైతం అదే రీతిలో ఉంటోంది. బజారుకు వెళ్తే ఇరుకు రహదారులపై బండి నడపడం కష్టంగా మారుతోంది. కొన్ని చోట్ల విశాలంగా రోడ్లున్నా ఫుట్‌పాత్‌(పాదబాట)ను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంతో రోడ్డు కుచించుకుపోయి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీధి వ్యాపారులను మినహాయిస్తే పక్కన షాపులున్న వారుకూడా ఇలా చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పురపాలక, ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డుపై బండి నిలిపితే పోలీసులు ఫొటో తీసి జరిమానా వేస్తున్నారు. ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా మారిన చోట బండి ఎక్కడ పార్కింగ్‌ చేయాలని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

నడకకు సైతం నరకయాతన

పట్టణంలో ప్రధానంగా కిసాన్‌చౌక్‌ నుంచి దేవీచంద్‌చౌక్‌ వరకు, వివేకానంద చౌక్‌ నుంచి ఠాకూర్‌ హోటల్‌ వరకు రహదారులపై ప్రధాన వ్యాపారాలు నెలకొన్నాయి. వీటికి మధ్య కేంద్రంగా అంబేడ్కర్‌ చౌక్‌ ఉంది. ఈ రహదారులు ప్రజల రాకపోకలు, షాపింగ్‌తో సందడిగా, అత్యంత రద్దీగా ఉంటాయి. రహదారుల విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించి పుర అధికారులు నాలాలను సైతం నిర్మించారు. విభాగినులను ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్‌ను ప్రజలు నడక సాగించేందుకు వీలుగా వదిలేయాల్సి ఉండగా.. కొందరు దీన్ని ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు రోడ్ల మీదనే అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేసి షాపింగ్‌ చేస్తున్నారు. వస్త్ర దుకాణాలు, ఆసుపత్రుల వద్ద ఈ సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని భవనాలకు సెల్లార్లు ఉన్నా పార్కింగ్‌ కోసం కాకుండా వ్యాపార ప్రయోజనార్థం వినియోగిస్తున్నారు. వ్యాపారుల ఇష్టారాజ్యం, అధికారుల పట్టింపులేనితనంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

కానరాని సమగ్ర ప్రణాళిక

పట్టణంలో జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్నా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికార యంత్రాంగం వద్ద సమగ్ర ప్రణాళిక లేదు. వీధి వ్యాపారుల కోసం గతంలో ప్రత్యేకంగా వెండింగ్‌, నాన్‌ వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినా అది కార్యరూపం దాల్చడం లేదు. ప్రధాన వ్యాపారాలు నెలకొన్న రహదారులైన మార్కెట్‌యార్డు నుంచి దేవీచంద్‌చౌక్‌ వరకు నాన్‌వెండింగ్‌ జోన్‌గా, వివేకానంద చౌక్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రిస్ట్రిక్టెడ్‌ వెండింగ్‌ జోన్‌గా ప్రకటించినా అమలు కావడం లేదు. మరోవైపు షాపుల వారు ఫుట్‌పాత్‌ను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా నియంత్రించలేకపోతున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించి పార్కింగ్‌ జోన్లను ఏర్పాటు చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుంది.


పట్టణ జనాభా : 1.80 లక్షలు

విస్తీర్ణం : 50.69 చ.కి.మీ

నివాసగృహాలు: 49,251

వ్యాపార కేంద్రాలు : 5,200

చిరు వ్యాపారులు : 3,500

అన్ని రకాల వాహనాలు : 85 వేలు


 

Read latest Adilabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని