logo

కాలువలో కలిసిన ప్రాణాలు

ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం.. ప్రైవేటు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం.. మారుమూల గ్రామాలు కావడంతో తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా నాలుగు

Published : 20 Jan 2022 03:17 IST

ఆ.. ప్రయాణం.. దినదిన గండమే!

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ అజయ్‌బాబు, ఎస్సై కె.రాజు

కడెం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం.. ప్రైవేటు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం.. మారుమూల గ్రామాలు కావడంతో తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా నాలుగు నిండు ప్రాణాలు కాలువలో కలిశాయి. నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మైనర్లు ఆటోలు నడపడం, లైసెన్సు లేని వాళ్లు కూడా యథేచ్ఛగా ప్రయాణికులను తీసుకెళ్లడం ఆ మార్గంలో నిత్యం జరిగే తంతు అయినా.. బుధవారం ఘటనతో వారెంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారో అర్థమైంది.

ఆటో కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన నలుగురు నిరుపేదలే. కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు బుధవారం బంధువుల ఇళ్లకు బయల్దేరారు. రెండు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు చెందినవారు ఆటో ఎక్కిన క్షణాల్లోనే ప్రమాదం చోటుచేసుకుంది.

బంధువుల ఇంటికి వెళుతుండగా..

ప్రమాదంలో మరణించిన కన్నాపూర్‌ పంచాయతీ చిన్నక్యాంపునకు చెందిన కోండ్ర శంకరమ్మ బంధువుల ఇంటికి బెల్లాల్‌ మొర్రిగూడెం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. భర్త, పిల్లలులేని ఈమె తన తల్లివద్దనే ఉంటూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. మరో అర కిలోమీటరు వెళితే ఆటో దిగి ఇంటికి వెళ్లేది. అంతలోనే మృత్యువు కబలించింది.

కాలువలో పడిన ఆటో

నలుగురు ఆడ పిల్లలే..

మరో మహిళ పెద్దబెల్లాల్‌కు చెందిన చీమల శాంత ప్రమాదం జరిగిన చోటుకు అర కిలోమీటరు ముందే ఆటో ఎక్కింది. ఈమెకు నలుగురు ఆడపిల్లలు.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చేందుకు బయల్దేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డల్లో ఒక్కరికి కూడా పెళ్లి చేయకుండా అర్ధాంతరంగా మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పరామర్శకు వెళుతూ..

మండలంలోని లింగాపూర్‌ పంచాయతీ మల్లన్నపేటకు చెందిన బోడ చిన్నరాజమల్లు చిన్నబెల్లాల్‌లో ఇటీవల తన బంధువొకరు మరణిస్తే వారిని పలుకరిద్దామని బయలుదేరాడు. మరో కిలోమీటరు వెళితే వారింటికి చేరుకునేవాడు. అంతలోనే అనంతలోకానికి వెళ్లడంతో వారి బంధువులు గుండెలవిసేలా విలపించారు.

కుమారుడిని చూడకుండానే..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిర్మల్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించిన శ్రీరాముల లక్ష్మి జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపల్లిలో ఉండే తన కుమారుని వద్దకని బయలుదేరింది. తల్లి రాకకోసం ఎదురుచూస్తున్న కుమారునికి చేదువార్త వినాల్సి వచ్చింది. గాయపడినా కోలుకుంటుందని ఆసుపత్రికి వెళితే అక్కడ మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా ఆమె దస్తురాబాద్‌ మండలం గొడిసిర్యాలలో నివాసముంటోంది.

తనిఖీలు ఎక్కడ..?

ఉపాధి కోసమని ఆటోలు నడుపుతున్న వారిలో కొందరికి లైసెన్సు లేకపోవడం, అనుభవం లేనివారికి యజమానులు ఆటోలు ఇస్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. బెల్లాల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, ఆయనతో ఉన్న మరోవ్యక్తి మైనర్‌లే కావడం, అజాగ్రత్తగా నడుపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆ గ్రామాలకు ప్రైవేటు వాహనాలే దిక్కు..

మండలంలోని బెల్లాల్‌ గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామం. గోదావరి నదిపై రెండేళ్లక్రితం వంతెన నిర్మించకముందు మారుమూల గ్రామమే. కానీ నిర్మల్‌- జగిత్యాల జిల్లాలను కలుపుతూ కడెం మండలం బెల్లాల్‌, జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపల్లిల మధ్యన రూ.40 కోట్ల వరకు వెచ్చించి వంతెన నిర్మించారు. గతేడాది జగిత్యాల నుంచి బోర్నపల్లి మీదుగా కడెం వరకు ఆర్టీసీ బస్సులు నడిచాయి. లాక్‌డౌన్‌ సమయంలో రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరించలేదు. దీంతో ఈ దారి వెంట ప్రైవేటు వాహనాల్లోనే ప్రమాదకరమైనా ప్రయాణించక తప్పడం లేదు.

కఠిన చర్యలు తీసుకుంటాం.. - అజయ్‌బాబు, సీఐ ఖానాపూర్‌

ఆటోలు, ఇతర వాహనాలు లైసెన్సులేకుండా నడిపితే చర్యలు తీసుకుంటాం. మైనర్లకు వాహనాలు ఇస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో బెల్లాల్‌ వద్ద జరిగిన ఆటోప్రమాదంతో తెలుసుకోవాలి. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, బండ్ల యజమానులపై కేసు నమోదు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని