logo

మాటలతో గారడీ.. నమ్మితే బురిడీ

కాలం మారుతోంది. సాంకేతికత విస్తరిస్తోంది. తదనుగుణంగానే దొంగతనాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిందితులు ఆధునికతను అందిపుచ్చుకుంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రత్యక్షంగా

Published : 21 Jan 2022 02:38 IST

పెరుగుతున్న సైబర్‌ నేరాలు

అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల ప్రచారం

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: కాలం మారుతోంది. సాంకేతికత విస్తరిస్తోంది. తదనుగుణంగానే దొంగతనాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిందితులు ఆధునికతను అందిపుచ్చుకుంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రత్యక్షంగా కనిపించకుండానే ప్రలోభాలతో, ఆకట్టుకునే మాటతీరుతో అందినకాడిని దోచుకుంటున్నారు. అంతర్జాలాన్ని వేదికగా చేసుకొని ఇలాంటి సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. పల్లెల్లో ఉండే అమాయక ప్రజలే లక్ష్యంగా వారు తమ మాటలగారడీతో బురిడీ కొట్టిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటే తప్ప వీటికి అడ్డుకట్ట వేయలేం.

నకిలీ ఖాతాలతో..
ఇటీవల పట్టణ సీఐ ముఖచిత్రంతో ఫేస్‌బుక్‌లో తెలిసిన వారికి ఓ సందేశం వచ్చింది. వైద్యావసరాల నిమిత్తం అర్జంటుగా రూ. 10 వేలు కావాలని అందులో అడిగారు. సీఐ సత్వరమే స్పందించడంతో ఇది నకిలీ సందేశమని గుర్తించారు. సాధారణంగా ఎవరైనా ఈ సందేశం చూడగానే అరె.. అధికారి ఏ అవసరంలో ఉన్నారోనని వెనకాముందు ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేస్తాం. కానీ, అడిగింది నిజంగా అతడేనా, నకిలీ వ్యక్తులా అనే ఆలోచన కూడా తట్టదు. అందుకే.. నిందితులు ప్రముఖంగా ఉన్న వ్యక్తుల ఫొటోలు, వివరాలతో నకిలీ ఖాతాలు సృష్టించి వారి మిత్రులు, సన్నిహితులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ను వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు డబ్బులు పంపించి, ఆ తర్వాత విషయం తెలుసుకొని మిన్నకుండిపోతున్నారు. పోలీసు అధికారికే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇతరుల సంగతి చెప్పక్కర్లేదు.

అధికారుల్లా వ్యవహరిస్తూ..
అమాయకులను బురిడీ కొట్టించేందుకు నిందితులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా సందేహాలను నివృత్తి చేస్తూ నిజమైన అధికారులు, ఉద్యోగుల్లానే మాట్లాడుతూ మభ్యపెడ్తున్నారు. నమ్మినవారి ఖాతా నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పలు సంఘటనలను పరిశీలిస్తే రోజుకో కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారని అవగతమవుతుంది.

* ఇటీవల లక్ష్మణచాంద మండలం పరిధిలోని ఓ మహిళకు ఫోన్‌కాల్‌ వచ్చింది. కౌన్‌బనేగా కరోడ్‌పతి లాటరీలో రూ.25 లక్షలు గెలుచుకున్నారని చెప్పారు. ఓ నెంబరు చెప్పి మాట్లాడితే అన్ని వివరాలు చెప్తారనగానే ఆమె వారిచ్చిన నెంబరుకు కాల్‌చేసింది. నిజంగానే లాటరీ వచ్చిందని, రూ.1.02 లక్షల పన్ను చెల్లిస్తే ఆ డబ్బు పంపిస్తామని చెప్పడంతో నిజమేననుకొని డబ్బు పంపించారు. తర్వాత ఆ ఫోన్‌నెంబరు స్విచాఫ్‌ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* నిర్మల్‌ గ్రామీణ మండలంలోనూ ఎక్స్‌యూవీ వాహనం గెలుచుకున్నారంటూ ఒకరికి కాల్‌ చేశారు. సేవా రుసుములు, పన్నుల కింద రూ.70 వేలు చెల్లింపజేసుకున్నారు. ఆ తర్వాత అది నకిలీ కాల్‌ అని గుర్తించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

* నర్సాపూర్‌ (జి) పరిధిలో ఒక వ్యక్తికి రుణం మంజూరైందని నమ్మబలికి, ఓటీపీ నెంబరు ఆధారంగా అతడి ఖాతా నుంచి రూ.85 వేలు ఖాళీ చేశారు.

* ఎస్‌బీఐ యోనో యాప్‌ అప్‌డేట్‌ పేరిట ఓ వృద్ధుడి ఖాతా నుంచి రూ.3 లక్షలకు పైగా ఖాళీ చేశారు.

* పీఎం యోజన పేరిట పట్టణంలో ఓ వ్యక్తి నుంచి రూ.77 వేలు డ్రా చేశారు.

* ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరలో వాహనం అమ్ముతామని సైనికుడి పేరిట బురిడీ కొట్టించిన నిందితులు రూ. 30 వేలు స్వాహాచేశారు.

* ఏటీఎం కేంద్రాల వద్ద తచ్చాడుతూ తెలివిగా కార్డులను క్లోనింగ్‌ చేసి డబ్బులు డ్రా చేస్తున్న ఘటనలు సైతం పట్టణంలో రెండు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మోసపోతే.. స్పందించాలి
అనుకోకుండా సైబర్‌ నేరస్థుల బారిన పడితే బాధితులు ఆందోళనకు గురికావొద్దు. ఎవరేమనుకుంటారోనని బిడియపడుతూ సమయం వృథా చేయకుండా పోలీసులను సంప్రదించాలి. టోల్‌ఫ్రీ నెంబరు 155260లో సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు అప్రమత్తమవుతారు. డబ్బులు ఖాతా నుంచి డ్రా అయినా అవి నిందితులకు చేరకుండా నిలువరించే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే రికవరీ కాస్త కష్టమవుతుంది.


చైతన్యం పెరగాలి
-జీవన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి డీఎస్పీ, నిర్మల్‌

జిల్లా పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య ఇటీవలికాలంలో పెరుగుతోంది. నేరస్థులు, వారి జిమ్మిక్కులపై ప్రజల్లో చైతన్యం పెరగాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఫోన్‌లలో నకిలీ యాప్స్‌ను, అనవసర లింకులను తెరవద్దు. సైబర్‌ నేరాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్‌ఫ్రీ నెంబరును సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలిస్తామని, డబ్బులు డిపాజిట్‌ చేయాలనో వచ్చే కాల్స్‌ను అనుమానించాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని