logo

ఇంటికొస్తారు.. ఆరా తీస్తారు..!

జిల్లా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి నాంది పలికింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితమవుతున్న

Published : 21 Jan 2022 02:38 IST

నేటి నుంచి ప్రత్యేక బృందాలతో సర్వే
మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే

జిల్లా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి నాంది పలికింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితమవుతున్న వారిని గుర్తించనుంది. నియంత్రణ, నివారణ చర్యలు తక్షణమే చేపట్టనుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనుంది. దగ్గు, జలుబు, జ్వరం, నొప్పులకు సంబంధించిన మందుల కిట్‌ను సైతం అందించనున్నారు. ఇంటింటా ఆరోగ్యం పేరుతో శుక్రవారం నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది. ఇందుకు ఇద్దరితో కూడి బృందం ప్రతి ఇంటిని సందర్శించి, కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు తెలుసుకోనున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వేర్వేరుగా పర్యటించనున్నారు. ఒక్కో బృందం రోజుకి వంద కుటుంబాల వివరాలు సేకరించనుంది. ఈ సర్వే మొత్తం ఐదు, నుంచి ఆరు రోజుల్లో పూర్తిచేయనున్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యే ఓపీ విభాగం..
కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా ఆసుపత్రితో పాటు 17పీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీల్లో ప్రత్యేక ఓపీ విభాగాన్ని శుక్రవారం నుంచి  వైద్యారోగ్యశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఉదయం 8 నుంచి ఈ సేవలు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగనుంది. కరోనా బాధితుల కోసం ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సంబంధిత సమయంలో నిరంతరాయంగా వైద్యుడు అందుబాటులో ఉండనున్నారు.


పకడ్బందీగా సర్వే

ఇంటింటా ఆరోగ్యం పేరుతో నిర్వహించే సర్వేని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. బృందంలోని సభ్యులు సేకరించాల్సిన వివరాలు, చేయాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే తెలియజేశాం. జ్వరంతో ఐదురోజుల కంటే ఎక్కువ ఉన్న బాధితులను గుర్తించి దగ్గరలోని ఆరోగ్యకేంద్రాలకు పంపించాలని సూచనలు ఇచ్చాం. ప్రస్తుతానికి జిల్లాలో కేసులు ఎక్కువగా వస్తున్నా.. ఏ ఒక్కరిలో తీవ్రత ఉండటం లేదు. ప్రతి ఒక్క బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆక్సిజన్‌, పడకలు, వెంటిలేటర్లు అన్ని అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల వార్డు కూడా సిద్ధంగా ఉంది. టీకా పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతోంది.

-డా.కుమురం బాలు, జిల్లా వైద్యాధికారి

మొత్తం బృందాలు: 485
పాల్గొనే సిబ్బంది: 970
పట్టణాల్లో సర్వే చేసే బృందాలు: 311 (ఒక రిసోర్స్‌ పర్సన్‌(ఆర్‌పీ), ఆశా కార్యకర్త)
గ్రామాల్లో: 174 (ఒక ఆశా కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని