logo

ఖాతాలో సొమ్ము పడక.. అన్నదాతల వెత

ధాన్యం మిల్లుకు చేరిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రోజులు గడుస్తున్నా ధాన్యం డబ్బులు చేతికందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి 

Published : 21 Jan 2022 02:38 IST

దండేపల్లి, జైపూర్‌, న్యూస్‌టుడే

దండేపల్లిలో కొనుగోళ్లు చేస్తున్న కేంద్ర నిర్వాహకులు

ధాన్యం మిల్లుకు చేరిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రోజులు గడుస్తున్నా ధాన్యం డబ్బులు చేతికందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి  పనులు ఊపందుకున్నాయి.వరి, ఇతర ఆరుతడి పంటల సాగు పనుల్లో రైతులు తలమునకలయ్యారు. పెట్టుబడి కోసం చేతిలో డబ్బులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతకు మద్దతు అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వానాకాలం పంటను అమ్మి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు నగదు జమకావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  హమాలీ కూలీ, కోత యంత్రాలకు ఇవ్వాల్సిన డబ్బులు, యాసంగి పెట్టుబడులు చెల్లించేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు.

పెట్టుబడికి తిప్పలు...
ఎరువులు, పురుగు మందుల కోసం సాధారణంగా వ్యాపారుల వద్ద పంట డబ్బులు రాగానే చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. పంట డబ్బులు రాగానే వడ్డీతో కలిపి వ్యాపారులకు చెల్లిస్తారు.పంట అమ్మి నెల రోజులు గడుస్తున్నా డబ్బులు ఖాతాలో పడకపోవడంతో బయట చెల్లించే అప్పులకు వడ్డీ పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి కోసం తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రైతుల చరవాణులకు ఓటీపీ వచ్చి 20 రోజులు దాటినా డబ్బులు రాకపోవడంతో తాము ధాన్యం అమ్మిన ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ కేంద్రాల నిర్వాహకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ పూర్తయిందని త్వరలోనే జమ అవుతాయని అధికారులు చెబుతున్నా..డబ్బులు జమ కాక ఆందోళన చెందుతున్నారు.

* ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేంకుమార్‌ను సంప్రదించగా.. ఆన్‌లైన్‌లో రైతులు, ధాన్యం అమ్మకాల వివరాలన్ని నమోదు చేశామని, నిధులు విడుదల కాగానే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


చిత్రంలో కనిపిస్తున్న రైతు గోపతి శ్రీనివాస్‌..దండేపల్లి మండలం నంబాల గ్రామం.. ఈయనకు ఏడు ఎకరాల పొలం ఉంది..వానాకాలంలో సాగు చేయగా స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రంలో 101 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు.. గతేడాది డిసెంబరు 31న ధాన్యం మిల్లుకు చేరగా..ఈనెల 2న ఆయన చరవాణికి ఓటీపీ కూడా వచ్చింది..కానీ ఆయనకు రావాల్సిన రూ. 2 లక్షలు ఇప్పటికీ రాలేదు. ఒకవైపు యాసంగి సాగు పనులు సాగుతుంటే పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని, వెంటనే డబ్బుల ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నాడు.


వడ్లమ్మి నెలరోజులవుతోంది

సొంత భూమి లేకపోవడంతో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని అప్పు చేసి వ్యవసాయం చేశాను. అందులో దిగుబడి 26 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. వడ్లమ్మి నెల రోజులవుతున్నా నేటికి  ఖాతాలో నగదు జమ కాలేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగితే తమ పరిధిలో ఉన్న పని పూర్తి చేశామని,  ప్రభుత్వం నుంచి రావాలంటున్నారు. మళ్లీ వ్యవసాయం చేద్దామంటే పెట్టుబడి లేక మళ్లీ అప్పులు తెవాల్సిన పరిస్థితి.

-గుడుగుల దేవేందర్‌, కౌలు రైతు, కాన్కూర్‌

జిల్లాలో వరి సాగు: 1.63 లక్షల ఎకరాలు
కొనుగోలు కేంద్రాలు: 243
కొనుగోలు చేసిన ధాన్యం: 1.37లక్షల మెట్రిక్‌ టన్నులు
మొత్తం రావాల్సిన డబ్బులు: రూ.268.78 కోట్లు
మొత్తం రైతులు: 25,827
ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు: రూ.163.97కోట్లు
చెల్లించాల్సిన డబ్బులు: రూ.102.36 కోట్లు
డబ్బులు పొందిన రైతులు: 14,335
ఎదురుచూస్తున్న వారు: 10,492

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని