logo

అడెల్లి పోచమ్మకు అద్భుత మందిరం

నిర్మల్‌ జిల్లాలో బాసర తరువాతి స్థానం అడెల్లి మహా పోచమ్మ ఆలయానిదే. దక్షిణ భారతంలో అతిపెద్ద పోచమ్మ దేవస్థానంగా పేరొందింది. ప్రతి ఆదివారం వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతటి

Published : 21 Jan 2022 02:38 IST

పునర్‌నిర్మాణానికి రూ.6.60 కోట్లు మంజూరు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే : నిర్మల్‌ జిల్లాలో బాసర తరువాతి స్థానం అడెల్లి మహా పోచమ్మ ఆలయానిదే. దక్షిణ భారతంలో అతిపెద్ద పోచమ్మ దేవస్థానంగా పేరొందింది. ప్రతి ఆదివారం వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఈ గుడి దశ, దిశ మారనుంది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌ నియోజకవర్గం సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి పోచమ్మ తల్లిని వారి ఇంటి దేవతగా కొలుస్తారు. ఆ శాఖ మంత్రిగా ఇప్పటి వరకు రూ.2 కోట్ల నిధులిచ్చి పనులు చేయించారు. తన హయాంలో సంపూర్ణ ఆలయ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇటీవలే మరో రూ.6.60 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఇతర ఆలయాల నుంచి రుణంగా తీసుకొని నిర్మాణ పనులు చేపట్టడానికి ఆ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. శాఖాపరంగా అన్ని పూర్తయ్యాయి. ఇక నిధులు విడుదల కావాల్సి ఉంది.

అడెల్లి మహా పోచమ్మ ఆలయం

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం గతంలో పెంకుటింటిలో ఉండేది. 1980-82 మధ్యకాలంలో ఆర్‌సీసీతో ఆలయం నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం 2017లో ప్రధానాలయానికి అనుసంధానంగా ప్రాకార మండపం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీతో ప్రధాన ఆలయం ఇరుగ్గా అమ్మవారి దర్శనానికి ఇబ్బందిగా మారింది. చిరుజల్లులు కురిసినా ప్రధాన ఆలయం పైభాగం నుంచి నీరు లోనికి వస్తున్నాయి. దీంతో ఆలయ పునర్‌నిర్మాణమే శాశ్వత పరిస్కారమని భావించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు, స్తపతులు ఆలయాన్ని సందర్శించి ఆలయ పునర్‌నిర్మాణం, అభివృద్ధి పనులపై ప్రణాళికలు(మాస్టర్‌ ప్లాన్‌) తయారు చేశారు. వాస్తుకు అనుగుణంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఆలయ నిర్మాణ డిజైన్‌ ఖరారు పూర్తికాగా పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనుల మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ఈ పనులను రెండు దఫాలుగా చేపట్టనున్నారు. తొలి విడతలో రూ.6.60 కోట్లతో ఆలయ పునర్‌నిర్మాణం పూర్తి చేస్తారు. రెండో దశలో ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం గెస్ట్‌హౌజ్‌లు, రేకుల షెడ్లు, మంచినీటి ట్యాంకులు, మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణాలు చేపట్టనున్నారు.

ప్రధాన ఆలయం, ప్రాకార మండపం నమూనా

శతాబ్దాలపాటు మన్నికగా ఉండేలా..
ఆలయ పునర్‌నిర్మాణం పటిష్ఠంగా చేయనున్నారు. శతాబ్దాల పాటు దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా, సువిశాలంగా భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా డిజైన్‌ చేశారు. ప్రధాన ఆలయాన్ని యాదాద్రి వలే కృష్ణ శిలలతో నిర్మించనున్నారు. ఆలయ ప్రత్యేకతను ప్రదర్శించేలా శిల్పకళతో నిర్మాణం జరగనుంది. ప్రధానాలయాన్ని ఆనుకొని ముందుభాగంలో ఆర్‌సీసీతో ప్రాకార మండపం ఏర్పాటు చేయనున్నారు. పునర్‌నిర్మాణంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారనునున్నాయి.


నిధులు విడుదల కాగానే టెండర్లు
-వడ్లూరి అనూష, ఆలయ ఈవో

లయ పునర్‌నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించి డిజైన్‌ తయారు చేశాం. మంజూరు కూడా వచ్చింది. నిధులు విడుదల కాగానే టెండర్లు పిలుస్తాం. అనంతరం నిర్మాణ పనులు చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని