logo

సీసీఐపై స్పష్టత ఇవ్వరేం?

మూతపడ్డ సీసీఐని తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే రామన్న పేర్కొన్నారు. నేను మంత్రిగా

Published : 21 Jan 2022 02:38 IST

కలెక్టరేట్‌ ఎదుట సాధన కమిటీ ధర్నా

ఎమ్మెల్యే రామన్నతో కలిసి వేదికపై అభివాదం చేస్తున్న సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులు

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : మూతపడ్డ సీసీఐని తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే రామన్న పేర్కొన్నారు. నేను మంత్రిగా ఉన్నపుడు పలు సందర్భాల్లో అప్పటి కేంద్ర మంత్రి అనంత్‌గీతేను కలిస్తే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని తీసుకురావాలంటే కేటీఆర్‌తోనూ వెళ్లి కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అప్పటి కేంద్ర సహాయ మంత్రి గంగారాం అహిర్‌తో సహా జిల్లా భాజపా నాయకులు సీసీఐ తెరిపిస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుత ఎంపీతో కలిసి దిల్లీ వచ్చేందుకు సిద్ధమని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా సిమెంటుకి భారీ డిమాండ్‌ ఉందని ప్రధాని మోదీ కిందటి అక్టోబరులో స్వయంగా చెప్పి మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని చెప్పినా ఫలితం లేదన్నారు. సాధన కమిటీ కన్వీనర్‌ దర్శనాల మల్లేష్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో సీసీఐని తెరిపిస్తామని భాజపా నాయకుల ప్రచారం నమ్మి స్థానికులు ఓట్లు వేసి ఎంపీని గెలిపించారన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశంలో సీసీఐ అంశాన్ని ప్రస్తావించి నిధులు విడుదలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌నేత, కో-కన్వీనర్‌ మునిగెల నర్సింగ్‌ తదితరులు మాట్లాడుతూ సీసీఐని తెరిపిస్తే అయిదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భూనిర్వాసితులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు తెరాస శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా తరలివచ్చారు. ధర్నా అనంతరం అదనపు పాలనాధికారి నటరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిటీ కో-కన్వీనర్లు నంది రామయ్య, విజ్జగిరి నారాయణ, ఎ.అరవింద్‌, లోకారి పోశెట్టి, కొండరమేష్‌, రూపేష్‌రెడ్డి, శశికాంత్‌, యూనిస్‌అక్బానీ, తెరాస, కాంగ్రెస్‌, సీపీఎం పట్టణాధ్యక్షులు అజయ్‌, నగేష్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలనాప్రాంగణానికి ర్యాలీగా వస్తున్న తెరాస శ్రేణులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని