logo

అక్కడికి వెళ్తారా.. ఇక్కడే ఉంటారా?

భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా విద్యాశాఖ తెచ్చిన మరో సరికొత్త ప్రతిపాదన ఉపాధ్యాయ దంపతులకు చికాకు తెప్పిస్తోంది. తాము కోరుకున్న విధంగా కాకుండా రివర్స్‌ స్పౌజ్‌ అవకాశం వినియోగించుకోవాలని సూచించడం వారిలో

Published : 21 Jan 2022 02:38 IST

స్పౌజ్‌ కేసులపై నివేదికలు కోరిన విద్యాశాఖ

ఉపాధ్యాయ దంపతుల నుంచి తీసుకున్న రివర్స్‌ స్పౌజ్‌ లెటర్‌ ఇదే..

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా విద్యాశాఖ తెచ్చిన మరో సరికొత్త ప్రతిపాదన ఉపాధ్యాయ దంపతులకు చికాకు తెప్పిస్తోంది. తాము కోరుకున్న విధంగా కాకుండా రివర్స్‌ స్పౌజ్‌ అవకాశం వినియోగించుకోవాలని సూచించడం వారిలో మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్‌, కుమురం భీం జిల్లాల నుంచి ఆదిలాబాద్‌కు వచ్చేందుకు 82 మంది స్పౌజ్‌ కేటగిరి కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తాజాగా అలా దరఖాస్తు పెట్టుకున్న వారి నుంచి రివర్స్‌ స్పౌజ్‌ వాడుకునే వారి వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించగా.. అందులో 81 మంది తాము అధికారులు అడిగినట్లు విల్లింగ్‌ ఇచ్చేందుకు అనాసక్తిని ప్రదర్శించారు. అలా నిరాకరించిన వారి నుంచి నాట్‌ విల్లింగ్‌ దరఖాస్తులను సైతం అధికారులు తీసుకున్నారు. అంటే స్పౌజ్‌ కేటగిరి వాడుకునేందుకు తమకిష్టం లేదనే రాతపూర్వక హామీని ఎవరికి వారే ఇచ్చేలా ప్రభుత్వం తమను ఇరుకున పెట్టిందని సంబంధీకులు లబోదిబోమంటున్నారు. స్పౌజ్‌ కేటగిరి వాడుకోవాలని చూసిన వారిలో మెజార్టీ దంపతుల్లో భార్యలు ఆదిలాబాద్‌కు వచ్చేందుకు దరఖాస్తు పెట్టుకోగా.. రివర్స్‌ స్పౌజ్‌ కింద భర్తలు ఉన్న చోటికి భార్యలకు వచ్చే అవకాశమివ్వకుండా భార్యలు బదిలీ అయిన జిల్లాకు భర్తలను పంపేందుకు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేయడంతో సంబంధీకులు ఎటూ తేల్చుకోని సందిగ్ధంలో పడిపోయారు. చివరకు తమకు రివర్స్‌ స్పౌజ్‌ ఇష్టం లేదని రాతపూర్వకంగా ఇవ్వడం.. అలా రాసి ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించడం ఆగమేఘాల మీద జరిగిపోయింది. మొత్తం మీద స్పౌజ్‌ కేటగిరి ప్రక్రియకు ప్రభుత్వం మంగళం పలకడం ఉపాధ్యాయ దంపతులను కలవరపెడుతోంది. అధికారులు ఉపాధ్యాయుల మెడమీద కత్తిపెట్టి నాట్‌విల్లింగ్‌ లెటర్లు రాయించుకోవడం అన్యాయమని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌, శ్రీనివాస్‌ మండిపడ్డారు.

ఒకే ఒక్కరి అంగీకారం
ఉపాధ్యాయ దంపతులైన షమీమ్‌ బేగం - మహ్మద్‌ ఆరీఫ్‌లలో ఇటీవల జిల్లా కేటాయింపుల్లో భార్య ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్లగా.. నిర్మల్‌లో పని చేసే భర్త ఆదిలాబాద్‌కు వచ్చారు. ఇందులో షమీమ్‌ బేగం తిరిగి ఆదిలాబాద్‌కు వచ్చేందుకు స్పౌజ్‌ కేటగిరీ కింద ఇదివరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్‌కు వచ్చేందుకు జిల్లాను హోల్డులో పెట్టడంతో వారిద్దరు ఒకచోటికి వచ్చే అవకాశం లేకుండాపోయింది. తాజాగా ప్రభుత్వం రివర్స్‌ స్పౌజ్‌కు అవకాశం ఇవ్వడంతో ఆదిలాబాద్‌ నుంచి భార్య పని చేసే నిర్మల్‌ జిల్లాకు వెళ్లేందుకు ఆరీఫ్‌ విల్లింగ్‌ లెటర్‌ అధికారులకు సమర్పించారు. ఆ దరఖాస్తుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నట్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని