logo

కరెంటు చౌర్యం.. రూ. కోట్లలో నష్టం

విద్యుత్తును వక్రమార్గంలో వాడి కొందరు ఆ శాఖ ఖజానాకు గండికొడుతున్నారు. వినియోగంలో ఎక్కువ నష్టాలు వచ్చే గ్రామాల్లో అధికారులు పర్యవేక్షిస్తుంటే.. విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కరెంటు చౌర్యం కారణంగా ఉమ్మడి జిల్లా మొత్తంలో విద్యుత్తు సంస్థ రూ.కోట్ల మేర నష్టపోతోంది.

Published : 21 Jan 2022 02:38 IST

మూడేళ్లలో 24 వేల మందిపై కేసులు
న్యూస్‌టుడే, రాంనగర్‌

కొండీలు వేసి అక్రమంగా విద్యుత్తు వినియోగం  

విద్యుత్తును వక్రమార్గంలో వాడి కొందరు ఆ శాఖ ఖజానాకు గండికొడుతున్నారు. వినియోగంలో ఎక్కువ నష్టాలు వచ్చే గ్రామాల్లో అధికారులు పర్యవేక్షిస్తుంటే.. విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కరెంటు చౌర్యం కారణంగా ఉమ్మడి జిల్లా మొత్తంలో విద్యుత్తు సంస్థ రూ.కోట్ల మేర నష్టపోతోంది.  మూడేళ్లలో ఇలా 24 వేల మంది ఇందుకు పాల్పడ్డారు.

ఉమ్మడి జిల్లాలో 9.80 లక్షల విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. గతంలో పాత మీటర్లతో చౌర్యానికి పాల్పడుతున్నారనే వాటిని మార్చేసి స్మార్ట్‌ మీటర్లను బిగించారు. చాలా గ్రామాల్లో మీటర్లు లేకుండా నేరుగా ఇళ్లకు విద్యుత్తును వినియోగిస్తుండటంతో సంస్థ లెక్కల్లో తేడా వస్తోంది. మూడేళ్లలో ఆ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో 24 వేల దొంగ కనెక్షన్లు బయటపడ్డాయి. వారిపై కేసులు నమోదు చేసి, చౌర్యం చేసిన కరెంటు విలువ రూ.7.05 కోట్లుగా లెక్క తేల్చారు. వీటిలో ఇళ్లకు సంబంధించిన కేటగిరి-1లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వారు 21 వేల మంది ఉన్నారు. వారికి రూ.5 కోట్ల జరిమానా వేశారు.

విధానాలెన్నో..
వ్యవసాయానికి ఉచితం కాగా, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా ఉంది. వ్యవసాయం మాటున ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. తీగలను నేరుగా మెయిన్‌ వైర్లకు కలిపి వాడుకోవడం, ఇంటి అవసరాలకు అని మీటర్‌ తీసుకొని దుకాణాలకు వాడుకోవడం,  మీటర్ల కంటే ముందే లూప్‌వైర్‌ పెట్టి వినియోగించుకోవడం తదితర వాటిని అధికారుల దాడుల్లో గుర్తించారు.

* ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ ఇంట్లో కరెంటు వినియోగానికి, చెల్లించే బిల్లుకు తేడా ఎక్కువగా ఉండటంతో తనిఖీ చేసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ ఇంటికి ఉన్న మీటరుకు వచ్చే వైరుకు మందుగానే బైపాస్‌ వైరును బిగించి, దాన్ని ఇంటి మోటారుకు కనెక్షన్‌గా ఇచ్చారు. దీంతో ఇంటి మోటారు ఎంత తిరిగినా.. ఇంటికి మాత్రమే బిల్లు వచ్చేది. అతడిపై కేసు నమోదు చేసి రూ.13వేలు జరిమానా వేశారు.

* ఉమ్మడి జిల్లాలో 300కు పైగా గ్రామాల్లో లైన్లకు కొండీలు వేసి వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఉట్నూర్‌ మండలం కొమ్ముగూడెంలో నేరుగా విద్యుత్తును వాడుకోవడాన్ని ఎస్‌ఈ ఉత్తమ్‌ఝాడే బుధవారం పరిశీలించారు. 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును వాడుకోవచ్చని చెప్పడంతో అప్పటికప్పుడే 39 మంది మీటర్లు బిగించుకునేలా చర్యలు తీసుకున్నారు.

* నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధికి దగ్గరి వ్యక్తి దొంగ కనెక్షన్‌ ద్వారా కరెంట్‌ వాడుకుంటున్నారు. గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి భారీగా జరిమానా వేశారు.

* ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ నాయకునికి ఇటుకబట్టీ ఉంది. పక్కనే ఉన్న పంట పొలంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ దానికి వాడేశారు. అధికారులు తనిఖీ చేసి సదరు నాయకునికి జరిమానాతో పాటు కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసులు నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.

విద్యుత్తు వినియోగంపై అవగాహన కలిగిస్తున్న అధికారులు

నష్టాలపై పరిశీలన
ఫీడర్ల వారీగా విద్యుత్తు వినియోగాన్ని లెక్కిస్తారు. ఒక్కో ఫీడర్లలో వినియోగానికి, బిల్లుల్లో నమోదైన విద్యుత్తును పోల్చి.. భారీగా తేడా వచ్చిన ఫీడర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. గతేడాది సాంగిడి, బరంపూర్‌, నర్సాపూర్‌, కొమ్ముగూడ తదితర ఫీడర్లలో భారీగా తేడా రావడంతో వినియోగం తీరును పరిశీలిస్తున్నారు. పోల్‌ టు పోల్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఫీడర్‌ పరిధిలో ఉన్న కనెక్షన్లు, వినియోగం తదితర వాటిని లెక్కించి నష్టనివారణకు చర్యలు తీసుకుంటున్నారు.


అక్రమ వాడకంతో ఇబ్బందులు
ఉత్తమ్‌ఝాడే, ఎస్‌ఈ, ఆదిలాబాద్‌

క్రమ వాడకం వల్ల సంస్థతో పాటు వినియోగదారులకు ఇబ్బందులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇస్తోంది. మీటర్లు ఏర్పాటు చేసుకొని, రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. మీటరు తీసుకునే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం ఇస్తే రాయితీ వర్తిస్తుంది.


కేసులు నమోదు చేస్తాం
వి.వి.రమణమూర్తి, విద్యుత్తు విజిలెన్స్‌ సీఐ

క్రమార్కులపై సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఉమ్మడి జిల్లా మొత్తంలో గతేడాది 8,940 మందిపై కేసులు నమోదు చేసి, ఇప్పటి వరకు 6,258 మంది నుంచి రూ.62 లక్షలు జరిమానా వసూలు చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని