logo

శిరస్త్రాణం ధరించినా.. దక్కని ప్రాణం

గణతంత్ర వేడుకలకు పాఠశాలను ముస్తాబు చేసి ఇంటికి బయలుదేరిన ఉపాధ్యాయుడు స్పీడు బ్రేకర్‌ను దాటే సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి మరణించాడు.

Published : 27 Jan 2022 05:07 IST


ప్రమాద స్థలంలో తలకు శిరస్త్రాణం ఉండగానే ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుడు రాజలింగం

లోకేశ్వరం, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలకు పాఠశాలను ముస్తాబు చేసి ఇంటికి బయలుదేరిన ఉపాధ్యాయుడు స్పీడు బ్రేకర్‌ను దాటే సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి మరణించాడు. శిరస్త్రాణం ధరించినా ప్రాణం దక్కలేదు. ఎస్సై సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజురా గ్రామానికి చెందిన కచ్చకాయల రాజలింగం(48) గడ్‌చాంద ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడి(ఎస్‌ఏ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గణతంత్ర దినోత్సవానికి పాఠశాలను ముస్తాబుచేసేందుకు తోటి ఉపాధ్యాయులతో కలిసి మంగళవారం సాయంత్రం వెళ్లి రాత్రి 11 వరకు అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి లోకేశ్వరం మీదుగా ఇంటికి బయలుదేరిన అతడు బాగాపూర్‌ అడ్డరోడ్డు వద్దకు రాగానే చిన్న స్పీడు బ్రేకర్‌ను దాటే సమయంలో వాహనం అదుపుతప్పి పడిపోయాడు. ఆ సమయంలో తలకు శిరస్త్రాణం అలాగే ఉండిపోయింది. కానీ పడ్డ సమయంలో తల పక్కకు తిరగడంతో ఊపిరాడక మరణించినట్లు ఎస్సై వివరించారు. రాజలింగంకు భార్య, కుమారుడు, కూతురున్నారు. బుధవారం జాతీయ పతాకావిష్కరణ అనంతరం రాజురాలో నిర్వహించిన అతడి అంత్యక్రియలకు మండల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు హాజరై కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని