logo

మాటరాని మౌనమిది.. ఆసరేది?

ఆ బాలుడి పేరు అంజన్న(12). మాటలు అసలు రావు. చెవులు వినిపించవు. వందశాతం దివ్యాంగుడు. నెన్నెల మండలం జంగల్‌పేటలో ఉంటాడు. దివ్యాంగుడైన ఆ బాలుడు కనీసం తల్లిదండ్రుల ప్రేమకూ నోచుకోలేదు. ఇలాంటి

Published : 28 Jan 2022 02:46 IST

అమ్మమ్మ, తాతతో బాలుడు

నెన్నెల, న్యూస్‌టుడే: ఆ బాలుడి పేరు అంజన్న(12). మాటలు అసలు రావు. చెవులు వినిపించవు. వందశాతం దివ్యాంగుడు. నెన్నెల మండలం జంగల్‌పేటలో ఉంటాడు. దివ్యాంగుడైన ఆ బాలుడు కనీసం తల్లిదండ్రుల ప్రేమకూ నోచుకోలేదు. ఇలాంటి చిన్నారికి కూడా ప్రభుత్వం అందించే ఆసరా అల్లంత దూరంలోనే ఉండిపోయింది. ఆ వృద్ధ దంపతులకు అతడి పోషణ భారమైంది. జంగల్‌పేట కొత్తగూడెం ఆవాస గ్రామానికి చెందిన రజిత, శంకర్‌ దంపతుల కుమారుడు అంజన్న. బాలుడి ఎనిమిదేళ్ల వయసు వరకు తల్లిదండ్రులు బాగానే పోషించారు. ఆ తర్వాత తండ్రి శంకర్‌ తాగుడుకు బానిసయ్యాడు. భార్య రజితతో తరచూ గొడవపడే వాడు. ఈ క్రమంలో రజిత స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టడంతో శంకర్‌  జైలుకు వెళ్లాడు. శంకర్‌ జైలు నుంచి తిరిగి వచ్చే సరికి బాలుడి తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయి మరో వివాహం చేసుకుంది. ఇలా తండ్రి, తల్లికి దూరమై వృద్ధులైన అమ్మమ్మ, తాతకు చేరువయ్యాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. కూలీ చేస్తే కానీ పొట్టగడవని ఆ కుటుంబానికి  బాలుడి పోషణ భారంగా మారింది. వాస్తవానికి దివ్యాంగులకు అందించే రూ.3000 పింఛన్‌కు బాలుడు అర్హుడు. కానీ ఇప్పటి వరకు దివ్యాంగుల గుర్తింపు పత్రం లేదు. మంచిర్యాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రం తీసుకోవడం వృద్ధ దంపతులకు ఇబ్బందిగా ఉంది. గతంలో రెండు సార్లు మంచిర్యాలకు వెళ్లినప్పటికీ పత్రం ఇవ్వలేదని చెప్పారు. సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బాలుడిని ఆదుకోవాలని బాలుడి అమ్మమ్మ, తాత కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని