logo
Updated : 20 May 2022 05:52 IST

కారులో కుదుపు...

 కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న నల్లాల ఓదెలు దంపతులు
ఈటీవీ - ఆదిలాబాద్‌
న్యూస్‌టుడే - మందమర్రి పట్టణం

ప్రియాంక గాంధీతో నల్లాల ఓదెలు కుటుంబ సభ్యులు

ఉమ్మడి జిల్లా తెరాస నేతల మధ్య నెలకొన్న అసమ్మతి క్రమంగా బయటపడుతోంది. ఆ పార్టీ అధిష్ఠానానికి సన్నిహితుడిగా పేరొందిన బాల్క సుమన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూర్‌ నియోజకవర్గంలోని కీలకనేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం గులాబీ దళంలో ఒక్కసారి కుదుపును సృష్టించింది. సింగరేణి కార్మిక క్షేత్రంలో కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నేతల్లో ఓదెలు ఒకరు. సింగరేణి కార్మికుల అండతో 2009లో తొలిసారిగా చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కేసీఆర్‌ నిర్ణయంతో 2010 ఫిబ్రవరిలో ఓదెలు రాజీనామా చేశారు. అదే ఏడాది జులైలో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో స్వరాష్ట్రం ఆవిర్భావంతో చెన్నూర్‌ తొలి ఎమ్మెల్యేగా ఓదెలు మూడోసారి ఎన్నికవ్వడంతో, ప్రభుత్వ విప్‌ పదవి లభించింది. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా పేరొందిన ఆయనకు 2018లో ఎన్నికల్లో తెరాస టిక్కెట్టు ఇవ్వలేదు. ఆయన స్థానంలో బాల్క సుమన్‌ను నిలబెట్టింది. అప్పట్లో తీవ్ర అసంతృప్తికి లోనైన ఓదెలు ఓ దశలో తన కుటుంబ సభ్యులతో కలిసి గృహనిర్బంధంలోకి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ తరువాత అధినేత కేసీఆర్‌ చొరవతో జిల్లాల పునర్విభజన తరువాత ఎస్సీ మహిళలకు రిజర్వ్‌ అయిన మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి ఓదెలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మికి తెరాస ఇచ్చిది. కానీ నియోజకవర్గ నేతల మధ్య ఉన్న అసంతృప్తిని పార్టీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.

కారణాలేమిటి?

శాసనసభ ఎన్నికల తరువాత ఓదెలు, బాల్క సుమన్‌ మధ్య విభేదాల అగాధం పెరుగుతూ వచ్చింది. ఓదెలు భార్య భాగ్యలక్ష్మి జడ్పీ ఛైర్‌పర్స్‌న్‌ అయినా తగిన ప్రాధాన్యం లభించలేదనే అసంతృప్తి వేళ్లూనుకుంది. ఇటీవల ధాన్యం రైతుల విషయంలో తెరాస దిల్లీలో చేపట్టిన మహాధర్నాకు ఓదెలు దంపతులకు విమానం టిక్కెట్లు ఇవ్వకపోవడం ఆయన అనుచరులను అయోమయానికి గురిచేసింది. దీన్ని సవాలుగా తీసుకున్న ఓదెలు చివరి నిమిషంలో తానే స్వయంగా విమాన టిక్కెట్లు తీసుకొని దిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రొటోకాల్‌ వ్యవహారంలో తన భార్య జడ్పీ ఛైర్‌పర్సన్‌కు సముచిత న్యాయం జరగడం లేదని, తనకు కార్యకర్తకు ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వడం లేదని తరచూ ఓదెలు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల దగ్గర గోడు వెళ్లపోసుకునే వారు. చివరికి ఇదే  అంశాలతో అధిష్ఠానానికి లేఖ రాయడం ప్రాధాన్యాన్ని రేకెత్తించింది. అయినా రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి ఓదార్పు లభించకపోవడంతోనే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది.

 

Read latest Adilabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts