logo

రిమ్స్‌లో గర్భిణి మృతి

పట్టణంలోని బొక్కలగూడకు చెందిన కొర్రివార్‌ అక్షిత(22) కాన్పు కోసం రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి శుక్రవారం ఉదయం గర్భస్థ శిశవుతో పాటు మృతి చెందింది. వైద్యులు

Updated : 21 May 2022 03:47 IST

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన

కొర్రివార్‌ అక్షిత

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే : పట్టణంలోని బొక్కలగూడకు చెందిన కొర్రివార్‌ అక్షిత(22) కాన్పు కోసం రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి శుక్రవారం ఉదయం గర్భస్థ శిశవుతో పాటు మృతి చెందింది. వైద్యులు వెంటనే వైద్యం అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లనే కడుపులో బిడ్డతో పాటు గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఐపీ విభాగం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది అక్షితకు వివాహమైంది. ఆమెకు తొమ్మిది నెలలు నిండటంతో బుధవారం సాయంత్రం రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షల అనంతరం కాన్పు కావటానికి ఇంకా సమయం ఉందని వైద్యులు సూచించి తరువాత రావాలనటంతో ఇంటికి వెళ్లిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సమస్య తలెత్తటంతో రిమ్స్‌ ఆసుపత్రికి నాలుగు గంటల ప్రాంతంలో రాగా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. దీంతో గర్భిణితో పాటు గర్భస్థ శిశువు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, సుహాసినిరెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళనకు మద్దతును తెలిపారు. వారు మాట్లాడుతూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో వైద్యం అందించకపోవటంతోనే గర్భిణి మృతి చెందిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అవసరమైన వైద్యులను సైతం నియమించకుండా నిరుపేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రభుత్వ తీరును విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన విషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆందోళన ఉదయం నుంచి 11 గంటల వరకు కొనసాగింది. ఈ ఘటన విషయమై ముగ్గురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తానని రిమ్స్‌ సంచాలకుడు రాఠోడ్‌ జైసింగ్‌ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని