logo

నాసిరకం.. నత్తనడక

వైకుంఠధామాల నిర్మాణాల్లో గుత్తేదారులు చేతివాటం చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దహన సంస్కారాలకు ఇబ్బందులు తలెత్తవద్దని నిధులు విడుదల చేస్తోంది. వాటి నిర్మాణాల్లో నాణ్యత

Published : 22 May 2022 03:37 IST

ఇష్టానుసారంగా శ్మశానవాటిక నిర్మాణాలు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ గ్రామీణం

వైకుంఠధామాల నిర్మాణాల్లో గుత్తేదారులు చేతివాటం చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దహన సంస్కారాలకు ఇబ్బందులు తలెత్తవద్దని నిధులు విడుదల చేస్తోంది. వాటి నిర్మాణాల్లో నాణ్యత పాటించకపోవడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు తేలగా, పలుచోట్ల కూలిపోతున్నాయి. గడువు మీరినా ఇంకా పనులు పూర్తికాని పరిస్థితి. జిల్లాలో చేపట్టిన నిర్మాణాల దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

జిల్లాలో 468 వైకుంఠధామాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు చెప్పడమే తప్ప నేటికీ చాలా చోట్ల ఇంకా అసంపూర్తిగా, నిర్మాణ దశలోనే ఉన్నాయి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి ఉన్నాయి. మరికొన్నిచోట్ల పనుల దశలోనే కూలిపోవడం నాణ్యత తీరును తేటతెల్లం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిశీలన చేపట్టాల్సిన అధికారులు అటువైపు చూడకపోవడంతో వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది.

గుత్తేదారులకు నాయకుల అండ

గుత్తేదారులకు నాయకుల అండ ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పనులపై ఆరా తీయాల్సిన పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదు. బిల్లులు సకాలంలో రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తుండగా, సకాలంలో నిర్మాణాలు చేపకట్టకపోవడంతోనే అలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.


నాణ్యత నవ్వుతోంది

ఇది ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని దిమ్మలో నిర్మించిన వైకుంఠధామం. నిర్మాణ దశలోనే పగుళ్లుతేలగా వాటిని సిమెంటు పూతలతో కనిపించకుండా చేసినా ప్రస్తుతం పగుళ్లు తేలి నాణ్యతలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వైకుంఠధామానికి వెళ్లేందుకు వేసిన సీసీ రోడ్డుదీ అదే తీరు. అప్పుడే నాణ్యతలోపంతో కనిపిస్తోంది.

పగిలిన గోడలు


కూలిపోయిన దహన సంస్కారాలు నిర్వహించే నిర్మాణం

అధ్వానంగా మారి..

ఇది ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకాపూర్‌లో చేపట్టిన వైకుంఠధామ నిర్మాణం. పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. చివరికి పాలనాధికారి పనుల పూర్తికి చర్యలు తీసుకోవడంతో మళ్లీ పనులు ప్రారంభించారు. దహన సంస్కారాలు నిర్వహించే నిర్మాణం ఇటీవల నిర్మాణ దశలోనే కూలిపోయింది. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు క్యూరింగ్‌ చేయక పరిస్థితి అధ్వానంగా తయారైంది. సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్న క్షేత్రస్థాయిలో పనులు అసంపూర్తిగా కనబడుతున్నాయి. అధికారులు నామమాత్రంగా వ్యవహరించడంతో ఇష్టారాజ్యంగా మారింది. దీని నిర్మాణం కోసం తీసుకున్న పంచాయతీ నిధులు రూ.2.50 లక్షలు తిరిగి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని