logo

గుట్కా.. రూ.కోట్ల సంపాదనకు చిట్కా!

ఓ వైపు జిల్లాలో పట్టణం నుంచి మారుమూల పల్లెలకు నిషేధిత గుట్కా విక్రయాలు నిత్యం రూ.కోట్లలోనే జరుగుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం మామూలుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.

Published : 22 May 2022 03:37 IST

చిరువ్యాపారులపై కేసులు...సూత్రధారులపై చర్యలు శూన్యం

ఇచ్చోడ, న్యూస్‌టుడే

ఇది జైనథ్‌ మండల కేంద్రంలో పట్టుకున్న గుట్కా. రెండు నెలల కిందట దాదాపు రూ.రెండున్నర లక్షల విలువైన గుట్కాను ఓ వ్యక్తి తన ఇంట్లో నిల్వ చేసుకున్నాడు. ముందస్తు సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా సరకు లభ్యమైంది. ఇలా అతను రూ.కోట్ల విలువ చేసే గుట్కాను మార్కెట్‌లో విక్రయాలు చేస్తున్నాడని వెల్లడైంది.


ఓ వైపు జిల్లాలో పట్టణం నుంచి మారుమూల పల్లెలకు నిషేధిత గుట్కా విక్రయాలు నిత్యం రూ.కోట్లలోనే జరుగుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం మామూలుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. చిన్నపాటి దాడులు నిర్వహిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నిషేధిత గుట్కా రవాణాపై ‘న్యూస్‌టుడే’ కథనం.

తక్కువ పెట్టుబడి అత్యధిక సంపాదనకు అవకాశం ఉండటంతో కొంతమంది వ్యాపారులు దర్జాగా గుట్కా అక్రమరవాణా చేస్తున్నారు. జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు దిగుమతి చేసుకొని అక్కడ నుంచి పల్లెలకు తరలిస్తున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసి అడ్డగోలు ధరలతో అమ్మకాలు జరుపుతున్నారు. గుట్కా విక్రయాలతో పాన్‌షాప్‌ నుంచి పెద్దస్థాయి దుకాణాల వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే పోలీసుల దాడిలో మాత్రం చిరు వ్యాపారులే దొరకడం, కేసులు నమోదు చేయడంతో.. వారు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడా వ్యాపారులపై నామమాత్రపు చర్యలు చేపట్టడం, చిన్నచితక వ్యాపారులపై కేసులు నమోదు చేయడం ఏంటని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో ఇలా..

* ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి రూ.కోట్లలో నిత్యం గుట్కా క్రయవిక్రయాలు జరుపుతున్నాడు. ఇప్పటికే అనేక సార్లు పోలీసులు పట్టుకొని కేసులు కూడా నమోదు చేశారు. అయినా అతని దందా అంతకు రెట్టింపు కాగా జిల్లా నలుమూలలకు రవాణా జోరు పెంచాడు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని అడ్డగోలు ధరలతో అమ్మకాలు సాగిసున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టే పరిస్థితి లేదు.

* ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ దుకాణదారుడు ఇప్పటికే గుట్కా అమ్మకాలు జరుపుతూ పట్టుబడటంతో ఎనిమిది కేసులకు పైగా నమోదయ్యాయి. కానీ దందా మాత్రం ఆగడం లేదు. ఇచ్చోడ మండలంతోపాటు సిరికొండ చుట్టుపక్క గ్రామాలకు రవాణా చేస్తున్నాడు. కిరాణాల మాటున రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నాడు.

* నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి గుట్కా వ్యాపారం దర్జాగా చేస్తున్నాడు. పెద్దల అండదండలతో అతని దందాకు అదుపు లేకుండా పోయింది. ఇతరులు అమ్మకాలు జరపకుండా చూడడం, అతనే నేరుగా రంగంలోకి దిగి విక్రయాలు చేయడం నిత్య కృత్యం. అయినా అతనిపై చర్యలు మాత్రం నామమాత్రమే. గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లోనూ అదే తీరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని