logo

భగ్గుమంటున్న పెట్రో ధరల్లో తగ్గుదల

నిత్యావసర సరకులతో సహా పెట్రో, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్రం ప్రజలపై భారం తగ్గించే నిర్ణయం తీసుకుంది. కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ధరలను తగ్గిస్తూ ప్రకటన

Published : 22 May 2022 03:37 IST

జిల్లా వాసులపై తగ్గనున్న భారం

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే

నిత్యావసర సరకులతో సహా పెట్రో, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్రం ప్రజలపై భారం తగ్గించే నిర్ణయం తీసుకుంది. కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ధరలను తగ్గిస్తూ ప్రకటన చేయడం పేద, మద్యతరగతి వర్గాలకు ఊరట లభించనుంది.

కేంద్రం పెట్రోల్‌పై రూ.8 డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. దీనికి అదనంగా రాష్ట్రం పెట్రోల్‌పై రూ.1.50 డిజిల్‌పై రూ.1 తగ్గించాల్సి ఉంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో 275 బంకులు ఉండగా... నిత్యం లక్షన్నర లీటర్ల పెట్రోల్‌, 12లక్షల మేర డీజిల్‌ లీటర్ల వినియోగమవుతోంది. ధరల తగ్గుదల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉమ్మడి జిల్లాలోని 30లక్షల మంది జనాభా పడనుంది. ప్రస్తుత తగ్గించిన పెట్రో ధరలు అమల్లోకి వస్తే నెలకు రూ.4.27కోట్ల మేర భారం తగ్గే అవకాశముంది. అదేమాదిరి డీజిల్‌ వినియోగదారులపై రూ.25.20కోట్ల ఆర్థిక భారం తగ్గి నిత్యావసర సరకులు ధరలు అదుపులోకి రానున్నాయి. డిజిల్‌ ధర పెరిగిన ప్రతిసారి రవాణాభారం పెరిగి నిత్యవసరాల ధరలు మండిపోవడం పరిపాటిగా మారింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో చమురు ధరలు తగ్గి సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం కొంత తగ్గనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాయితీ పెరిగింది..!

చమురు ధరలతో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు పోటీపడటం.. ఆ ధర ఏకంగా వెయ్యి రూపాయలు దాటడం మళ్లీ కట్టెలు వినియోగించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్‌ ధర రూ.1084 ఉండగా.. వినియోగదారు డబ్బులు చెల్లించాక నగదు బదిలీ రూపేన కేవలం రూ.47 రాయితీ జమవుతోంది. కేంద్రం తాజాగా రాయితీ రూ.200 ఇస్తామని ప్రకటించడంతో వినియోగదారులపై ఆమేరకు భారం తప్పనుంది. ఈ రాయితీని ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద సిలిండర్లు పొందుతున్న వారికి మాత్రమే వర్తింపజేయనున్నారు. ఈ పథకం లబ్ధిదారులు ఉమ్మడి జిల్లాలో 3.80లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరు ఏడాదికి 12 సిలిండర్లను వినియోగిస్తే రూ.2400 రాయితీ సొమ్ము వారి ఖాతాల్లో తిరిగి జమకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక సిలిండర్‌ను మొత్తం లబ్ధిదారులు వినియోగిస్తే నెలకు రూ.7.60 కోట్ల మేర చెల్లించిన డబ్బు రాయితీ రూపేణా తిరిగి రానుంది.

* పెట్రోల్‌ బంక్‌ వెలవెల...!పెట్రో ధరలు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలిపే చిత్రమిది. పెట్రో ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం ఫలితంగా శనివారం 7గంటల నుంచి ఆదిలాబాద్‌ పట్టణంలోని పోలీస్‌ శాఖ బంక్‌ వాహనదారులు లేక వెలవెలబోయింది. ఎలాగూ ధరలు తగ్గుతున్నాయి కదా.. ఎవరూ ఇంధనం పోయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో రద్దీగా ఉండే బంకులన్నీ శనివారం ఇలా జనసందోహం లేక కళ తప్పాయి.

ఉమ్మడి జిల్లాలో..

* ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన లబ్ధిదారులు: 3.80 లక్షలు

* నెలకు రాయితీ రూపేణా తిరిగి వచ్చే సొమ్ము: రూ.7.60కోట్లు

* రోజుకు పెట్రోల్‌ వినియోగం: 1.50లక్షల లీటర్లు

* తగ్గనున్న భారం: రూ. 14.25లక్షలు

* రోజుకు డీజిల్‌ వినియోగం: 12లక్షల లీటర్లు

* తగ్గనున్న భారం: రూ.84లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని