logo

వైవిధ్యమే జీవితం.. గుర్తిస్తేనే మనుగడ సాధించగలం

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో 20 శాతం జీవ జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి 4 నుంచి 5 సెకన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఒక జీవి

Published : 22 May 2022 03:37 IST

నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం

జన్నారం, న్యూస్‌టుడే

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో 20 శాతం జీవ జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి 4 నుంచి 5 సెకన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఒక జీవి అంతరించిపోతుందని వారు భావిస్తున్నారు. అంతరించి పోయే జాతులను కాపాడుకోకుంటే మనిషి మనుగడ సాగించలేడు. సకల ప్రాణులకు ఆహారం లభించాలంటే అన్ని జీవులు బతికి ఉండాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అసవరం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేవి దట్టమైన అడవులు. అందులో జాలువారే సెలయేళ్లు, చెంగున ఎగిరే జింకలు, పెద్దపులులు, చిరుతలకు నిలయం. విభిన్నమైన వృక్ష జంతు జాతులకు ఆలవాలంగా నిలుస్తోంది. కవ్వాల్‌ అభయారణ్యం, కుంటాల, పొచ్చెర వంటి జలపాతాలు, గిరిజన జాతులు, పంటల సాగులు వెరసి జీవ వైవిధానికి ఉమ్మడి జిల్లా చక్కని ఖిల్లాగా విలసిల్లుతోంది. అయితే ప్రకృతి వనాలను మనుషులు వారి స్వార్థం కోసం వాడుకోవడం వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. అందులో జీవనం సాగిస్తున్న జంతు జాతులు, పక్షులు అంతరించి పోయే ప్రమాదపుటంచునకు చేరుకుంటున్నాయి

ఉమ్మడి జిల్లా పరిస్థితి ఇలా....!

* చెన్నూరు ప్రాంతంలో డైనోసార్ల జాతికి చెందిన రినోసార్లు సంచరించినట్లుగా వాటి అవశేషాలను అప్పట్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

* జన్నారం అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతు, వృక్షజాతులు ఉండడం వల్ల జీవ వైవిధాన్యినికి కేంద్రంగా మారింది. అయితే ఇందులోనూ కొన్ని రకాలు పక్షి జాతులు కనిపించకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. పదేళ్ల క్రితం కనిపించిన ఔషధ మొక్కలు కనుమరుగు కావడం జీవ వైవిధాన్యినికి గొడ్డలి పెట్టులాంటిదే.

* కుంటాల, పొచ్చెర వంటి జలపాతాలు ఉండడంతో జంతు జాతులకు స్థావరంగా మారాయి. అయితే వేటగాళ్ల ఉచ్చు నుంచి వన్యప్రాణులు తప్పించుకోలేక విలవిల్లాడుతున్నాయి.

* పచ్చని అడవులు, గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలు, సహ్యాద్రి పర్వత శ్రేణులు, వివిధ రకాల పంటల సాగులు చేయడం జీవ వైవిధ్యానికి ఉమ్మడి జిల్లా నిలయంగా మారింది.

కనుమరుగవుతున్న జంతు, వృక్షజాతులు

* ఒకప్పుడు మన ఇంటి వాకిట్లోకి వచ్చే పిచ్చుకలు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. పంట పొలాల మీద వాలి పంట వినాశనం చేసే పురుగులను ఆహారంగా తీసుకునే అవి ఇప్పుడు కనుచూపు మేర కనిపించడం లేదు.

* రాబంధుల జాడే లేకుండా పోయింది. ఇటీవల బెజ్జూర్‌ అడవుల్లో కొన్నింటిని కనుగొన్నారు. అయితే గ్రామాల్లో జంతువుల కళేబరాలను తినేందుకు రారాజులా వాలి పోయే వాటి జాతి సైతం అంతరించి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

* గంగ రొయ్యలు ఎక్కడో గోదావరి, పెన్‌గంగ వంటి ప్రాంతాల్లో తప్పా అవి చెరువుల్లో లభించే పరిస్థితి లేకుండా పోయింది.

* అడవుల్లో ఉండే జిగురు, ఎగిసే, వేగివృక్షం, సర్పగంది జాతులకు చెందిన వృక్షాలు కనుమరుగయ్యాయి. తునికి చెట్లు, మరికొన్ని రకాలు పండ్ల చెట్లు అడవిలో పూర్తిగా కనిపించకుండా పోవడంతో కోతులు గ్రామాల బాట పట్టి మనుషుల మీద పడి రక్కుతున్నాయి.

మనమేం చేయాలి

అన్ని రకాల జీవ రాశులు, వృక్ష జాలాల మనుగడకు అడవి ఒక్కటే స్థావరం. పురి విప్పి నర్తించే మయూరాలు, అడవికే అందాన్నిచ్చే జింకలు జీవ వైవిధ్యాన్ని నెలకొల్పే పెద్దపులులు క్షేమంగా ఉండేది అటవీ ప్రాంతంలోనే. అలాంటి అడవులను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి. అడవులను రక్షించుకోవడం వల్ల రుతు పవనాలు సకాలంలో వచ్చి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అడవులను పెంచితే అవి జీవ వైవిధ్యాన్ని కాపాడుతాయి. ఒకే తరహా పంటల కాకుండా విభిన్నమైన పంటలను సాగు చేయాలి.

అడవులను పెంచేలా ప్రోత్సహించాల్చి

- గుండేటి యోగేశ్వర్‌, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రతినిధి, పర్యావరణ వేత్త, మంచిర్యాల.

జీవ వైవిధ్యమే మన జీవితమని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. జీవ వైవిధ్యం లేకుంటే ఆహారపు గొలుసు తెగిపోతుంది.శాఖాహార జంతువులు పచ్చని గడ్డిని తింటే మాంసాహార జంతువులు శాఖాహార జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. ఒక జీవి మనుగడ మరొక జీవి మీద ఆధారపడి ఉటుంది. అడవులను పెంచేలా ప్రోత్సహించాలి. వీటికి తోడు చట్టాలను కఠినంగా అమలు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని