logo

పట్టికను పట్టించుకోరు.. పెట్టింది తినమంటారు

ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ చికిత్సల నిమిత్తం, ప్రసవాల కోసం వచ్చే నిరుపేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ ఆశయం పకడ్బందీగా అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న

Published : 22 May 2022 03:37 IST

ఆసుపత్రుల్లో భోజన సౌకర్యం అంతంత మాత్రమే

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలో వడ్డిస్తున్న పప్పు, అన్నం

ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ చికిత్సల నిమిత్తం, ప్రసవాల కోసం వచ్చే నిరుపేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ ఆశయం పకడ్బందీగా అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో ఎంతోకొంత మిగుల్చుకోవాలనే దురాశతో గుత్తేదారులు చాలాచోట్ల పట్టికప్రకారం సకాలంలో ఆహారం అందించడం లేదు. దీంతో చాలాచోట్ల బయట నుంచి తెచ్చుకొని తింటున్నారు. గుత్తేదార్లు పప్పు అన్నం, నీళ్ల చారుతోనే సరిపెడుతున్నారు. రోగులు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం ఇటీవల మెస్‌ ఛార్జీలను సైతం పెంచింది. అయినప్పటికీ పరిస్థితి ఏమార్పు లేదు. టెండర్‌ పూర్తయి పనులు దక్కించుకున్న గుత్తేదారు పాత పద్ధతే అవలంబిస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆసుపత్రుల్లో భోజనం తినడానికి రోగులు ఇష్టపడటం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పెట్టిందే తినూ అనే చందంగా గుత్తేదారులు వ్యవహరిస్తున్నారు.

జిల్లా కేంద్రంతో పాటు, సిర్పూర్‌(టి) పట్టణంలో సీహెచ్‌సీ ఆసుపత్రులున్నాయి. ఆసిఫాబాద్‌ పట్టణంలో నిత్యం రెండు నుంచి మూడు వందల వరకు ప్రజలు ఆసుపత్రికి వస్తారు. 20 నుంచి 40 మంది వరకు ఆడ్మిట్‌ అవుతారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం గుడ్డు, అరటి పండు ఇవ్వాలి. అన్ని ఆసుపత్రుల్లో ప్రతినెలా 250 నుంచి 300 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవ అనంతరం వారంరోజుల పాటు బాలింతలు ఆసుపత్రిలోనే ఉంటారు. వీరికి, సహాయకులు ఇద్దరికి భోజనం పెట్టాలి. ఈ నెల 10 నుంచి అదనంగా నిధులు కేటాయించారు. ఆన్‌లైన్‌లో టెండర్‌ నిర్వహించగా, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి)లో ఒక్కరే పాల్గొనడంతో వీరికే భోజన బాధ్యతలు అప్పగించారు.

అన్నిచోట్లా అంతే...

ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) ఆసుపత్రుల్లో కేవలం రోగులకు పప్పు అన్నమే వడ్డిస్తున్నారు. మిగతా 21 పీహెచ్‌సీలలో సైతం ఇదే పద్ధతి కొనసాగుతోంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అస్సలు వంటలే చేయడం లేదని సమాచారం. కేవలం అల్పాహారంగా ఉప్మాతోనే సరిపెడుతున్నారని రోగులు వాపోతున్నారు. బాలింతలకు, సాధారణ వార్డుల్లో ఉండే రోగులకు అందరికీ ఒకే రకమైన భోజనం అందిస్తున్నారు.

ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలో అల్పాహారం సకాలంలో ఇవ్వకపోవడంతో బయటి

నుంచి టిఫిన్‌ తెచ్చుకొని తింటున్న వృద్ధురాలు

ఛార్జీల పెంపు..

గతంలో ఆసుపత్రుల్లో ఒక్కొక్కరికి భోజనం పెట్టడానికి ప్రభుత్వం రూ.40 వరకు ఇచ్చేది. ప్రస్తుతం సాధారణ భోజనానికి రూ.80, క్షయ, మానసిక, క్యాన్సర్‌ రోగులకు రూ.112, విధుల్లో ఉండే వైద్యులకు రూ.160, ఆరోగ్యశ్రీలో చికిత్సలు చేయించుకునే వ్యక్తులకు రూ.200 చెల్లిస్తున్నారు. ఇందులో గుడ్లు, రెండు రకాల కూరగాయలు, పెరుగు, పల్లిపట్టి, అరటిపండు తప్పనిసరిగా భోజనంలో అందించాలి. జిల్లాలో ఎక్కువగా రక్తహీనతతో వచ్చే గర్భిణులు, బాలింతలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే సంకల్పంతో అధికారులు ఈ సంవత్సరం ధరలను పెంచారు.

మూడు రోజులు పప్పు అన్నమే..

బామినే బిక్కు, అడ, ఆసిఫాబాద్‌

నా కుమారుడు అభిజిత్‌కు రక్తం తక్కువగా ఉందంటే ఎక్కించడానికి ఆసుపత్రికి వచ్చాను. మూడు రోజులు ఉన్నాను. నిత్యం పప్పు అన్నమే పెట్టారు. కూరలేమీ ఇవ్వలేదు.

నాణ్యమైన భోజనం పెట్టేలా చూస్తాం..

స్వామి, ఆసుపత్రి పర్యవేక్షకులు

మారిన ఆహార పట్టిక ప్రకారం రోగులకు నాణ్యమైన భోజనం ఒకటి రెండు రోజుల్లో పెట్టేలా చూస్తాం. కొత్త మెనూ ప్రకారం ఆహారం అందించకపోతే సంబంధిత గుత్తేదారును తొలగిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు