logo

పోషకాహారలోపం నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

పోషకాహార లోపాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నామని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. శనివారం

Published : 22 May 2022 03:37 IST

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: పోషకాహార లోపాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నామని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. శనివారం జాతీయస్థాయిలో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిషన్‌ సంపూర్ణ పోషణ్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 967 అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలున్న గ్రామాల పరిధిలో కూరగాయలు, చిరుధాన్యాలు, ఇతర పౌష్టికాహార ఉత్పత్తులు సాగు చేసి అవే గ్రామాల్లో తక్కువ ధరలకు అందించేలా చూస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘం సభ్యులు, సర్పంచులు, కార్యదర్శులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులను భాగస్వాములు చేసి ప్రతినెలా పోషకాహార వారం నిర్వహించి నాణ్యమైన ఆహారం తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోషకాహార ఆవశ్యకతను తెలిపేలా ప్రభుత్వ బడులు, అంగన్‌వాడీ కేంద్రాలు, నివాస గృహాల్లో న్యూట్రీ గార్డెన్‌లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆరోగ్య పరంగా జిల్లాను ముందు వరుసలో నిలబెట్టేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సాగేలా దృష్టిసారించినట్లు వివరించారు. జిల్లాలోని 15 బ్లాక్‌లకు గాను నాలుగు బ్లాక్‌లలో ఈ కార్యక్రమం ప్రారంభించామని.. మిగతా వాటిలోనూ త్వరలో మొదలు పెడతామన్నారు. పోషకాహార లోపంతో సంభవించే మరణాలు పూర్తిస్థాయిలో అరికట్టేలా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని