logo

అసైన్డ్‌ భూముల్లో.. అక్రమ దందా

పట్టణ శివారులోని శాంతినగర్‌లో ఖాళీగా కనిపిస్తున్న ఈ అసైన్డ్‌భూమిని అప్పట్లో లబ్ధిదారులకు కేటాయించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ఆ భూములకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు

Updated : 22 May 2022 03:39 IST

ఏమార్చి.. చిన్న ప్లాట్లుగా మార్చి విక్రయం

నిర్మల్‌, న్యూస్‌టుడే

పట్టణ శివారులోని శాంతినగర్‌లో ఖాళీగా కనిపిస్తున్న ఈ అసైన్డ్‌భూమిని అప్పట్లో లబ్ధిదారులకు కేటాయించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ఆ భూములకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అయినా.. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు ఆ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు.


జిల్లా కేంద్రంగా ఏర్పడిన నిర్మల్‌లో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అసైన్డ్‌ భూముల్లో ‘రియల్‌’ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆయా స్థలాలను కేవలం సాగుకు మాత్రమే వినియోగించాలనే నిబంధనలున్నా.. ప్లాట్లుగా మార్చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి చిన్న చిన్న ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు తెర వెనుకుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జోరుగా క్రయ విక్రయాలు..

భూమిలేని నిరుపేదల జీవనాధారం కోసం అసైన్డ్‌భూమిని కేటాయిస్తారు.. ఆ భూముల్లో పంటలు సాగుచేస్తూ జీవనం కొనసాగించడానికి స్థానికులకే ఆ భూమిని అప్పజెప్తారు.. ఆ భూమి యజమాని మరణిస్తే వారసులకు చెందుతుంది. అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు కూడా కావు. నిర్మల్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా అసైన్డ్‌భూముల క్రయ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. నిర్మల్‌ శివారులో శాంతినగర్‌, సోఫినగర్‌, తదితర ప్రాంతాల్లో అసైన్డ్‌భూములను కొనుగోలు చేసి వారు మున్సిపల్‌ రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఎంతోకొంత ముట్టజెప్పి ఆ భూములకు అసెస్‌మెంట్‌ (కొలతలు) చేయించుకుని ఇంటి నెంబర్లు తీసుకున్నారు. ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించడంతో సదరు వ్యక్తులు ఆ స్థలాలకు ఆస్తి పన్ను చెల్లిస్తూ వస్తున్నారు. అక్కడ ఇళ్లు ఉన్నట్లు పత్రాలు ఉండటంతో ఆ భూములను అసెస్‌మెంట్‌, ఆస్తి పన్ను పత్రాల ఆధారంగా దర్జాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. శాటిలైట్‌ ఆధారంగా నిర్మల్‌ మున్సిపల్‌ పరిధిలో 18,021 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి బిల్‌ కలెక్టర్లతో కొలతలు తీయించారు. ఇందులో ఇప్పటివరకు 15,139 ఇళ్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా.. మరో 72 తిరస్కరించారు. మిగతా 2,810 ఇళ్లు కనిపించడం లేదు.. వీటిలో కొన్ని ఖాళీ భూములకు ఇంటి నెంబర్లు కేటాయించగా.. మరికొన్ని అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేసినట్లు స్పష్టమైంది.

చూసీ చూడనట్లు ..

జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో నిజామాబాద్‌ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారికి ఇరువైపులా అసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఇక్కడ పట్టా భూమి ఎకరం రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుండగా.. ఆసైన్డ్‌ స్థలానికి ఎకరాకు రూ.కోటి నుంచి కోటిన్నర వరకు వెచ్చిస్తున్నారు. గతంలో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాలు ఇప్పటికే చాలా మంది చేతులు మారుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు అక్కడికెళ్లి చూసి వస్తున్నారే కాని.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసైన్డ్‌ భూముల్లో స్థిరాస్తి దందా వెనుక కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చాలా మంది పేదలు తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో కొనుగోలు చేస్తున్నా.. రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే.. అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు జరపడం నేరం. పేదలు తక్కువ ధరకు వస్తున్నాయనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని