logo

ఏరీ.. అధికారి..!

ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టడంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ కీలకపాత్ర పోషిస్తుంది. నూతన జిల్లాలు ఏర్పడటంతో దాదాపు అన్నిచోట్ల రియల్‌ వ్యాపారం ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. జిల్లాగా

Published : 22 May 2022 03:37 IST

మూడేళ్లలో ఎనిమిదిసార్లు మారిన వైనం

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే

క్రయవిక్రయాలు లేక వెలవెలబోతున్న దృశ్యం

ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టడంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ కీలకపాత్ర పోషిస్తుంది. నూతన జిల్లాలు ఏర్పడటంతో దాదాపు అన్నిచోట్ల రియల్‌ వ్యాపారం ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. జిల్లాగా ఏర్పడకముందే మంచిర్యాలలో భూక్రయవిక్రయాలు జోరుగా సాగేవి. జిల్లాగా ఆవిర్భవించాక ఇంకా పెరిగింది. ప్రతిరోజు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. శాఖకు రూ.కోట్లలో ఆదాయం వచ్చేది. ఇటీవల ప్రభుత్వ నిబంధనలతో కొంత, వ్యవసాయేతర భూములను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేయాలని నియమాలు విధించడంతో ఇంకొంత ఆదాయం రావడం తగ్గింది. అయినా జిల్లాకేంద్రం, చుట్టు పక్కప్రాంతాల్లో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటంతో ప్లాట్ల క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. గత మూడేళ్ల నుంచి మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్‌గా వచ్చిన ఏ ఒక్కరు నిలకడగా ఉండకపోవడంతో కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. శాశ్వత అధికారిని నియమించకపోవడం, ఇన్‌ఛార్జులకు పూర్తి అధికారాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. క్రయవిక్రయాలు లేక కార్యాలయం గత కొన్నిరోజులుగా వెలవెలబోతోంది. ఆదాయానికి గండిపడుతోంది.

ఐదేళ్లలో ఒకరు.. మూడేళ్లలో ఎనిమిది

గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఐదేళ్లపాటు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించారు. పదవి విరమణను ఇక్కడే చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఆరునెలలపాటు సక్రమంగా ఉన్నది లేదు. ఇలా వచ్చి అలా వెళ్లారు. మూడేళ్లలో ఎనిమిది మంది సబ్‌రిజిస్ట్రార్లు మారడం విశేషం.

* 2014లో సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు.. 2019వరకు కొనసాగారు. అనంతరం కొద్దిరోజులపాటు ఇన్‌ఛార్జులతో నెట్టుకువచ్చారు. ఇక్కడే సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌రాజు కొద్దిరోజులపాటు వ్యవహరించి బదిలీపై కరీంనగర్‌కు వెళ్లగా.. ఆదిలాబాద్‌ కార్యాలయం నుంచి రవికాంత్‌ వచ్చారు. ఈయన విధులు నిర్వహిస్తుండగానే శాశ్వత అధికారిగా అప్పారావును నియమించారు. మరో మూడేళ్లు ఎలాంటి సమస్య ఉండదనుకుంటే మూడు నెలల్లోనే తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయడంతో అప్పారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆ తర్వాత మళ్లీ ఆదిలాబాద్‌ నుంచే మురళీకృష్ణకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఆయన కొనసాగుతుండగానే నరేష్‌ శాశ్వత అధికారిగా వచ్చారు. కార్యకలాపాలు సాఫీగా జరుగుతున్నాయి అనుకునే సమయంలోనే జోనల్‌ వ్యవస్థకు సంబంధించిన బదిలీలు రావడంతో నరేష్‌ జనగామకు వెళ్లిపోయారు. అనంతరం రాము బాధ్యతలు చేపట్టగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనతో గ్రూప్‌-1 కొలువు కోసం సెలవుపెట్టారు. దీంతో ఇమ్రాన్‌ను సబ్‌రిజిస్ట్రార్‌గా నియామకం చేయగా.. ఇక్కడి పని ఒత్తిడా లేదా వ్యక్తిగత కారణమా.. పనిచేయడం ఇష్టంలేదో తెలియదుగానీ ఈయన సైతం సెలవులో వెళ్లారు. ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో అశోక్‌ తాత్కాలిక సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అధికారాలు లేని సబ్‌రిజిస్ట్రార్‌..

మంచిర్యాలశాఖకు శాశ్వత అధికారికి మాత్రమే పూర్తిస్థాయి అధికారాలు ఉంటాయి. తాత్కాలికంగా వచ్చినా, ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నవారు పరిమితికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. అన్నిరకాల వ్యవహారాలకు సంబంధించిన అధికారం వీరికి ఉండదు. గడిచిన మూడేళ్లలో ఒకరిద్దరు తప్ప ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు ఇన్‌ఛార్జులుగానే ఉన్నారు. దీంతో కొన్ని లావాదేవీల్లో జాప్యం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని