logo

రండి.. రాయండి..!

కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డీఈఓ టామ్నె ప్రణీత ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష

Published : 23 May 2022 02:57 IST

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డీఈఓ టామ్నె ప్రణీత ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గదులన్నింటినీ శానిటైజ్‌ చేయించారు. ఉదయం 9 గంటలలోపు విద్యార్థులు చేరుకోవాలి. 9.35 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు డీఈవో కార్యాలయానికి చేరుకోగా.. వాటిని పరీక్ష కేంద్రాల సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లలో భద్రపరిచారు. ప్రత్యేక కస్టోడియన్ల నడుమ కేంద్రాలకు చేరవేయనున్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ సిబ్బందితో కూడిన వారిని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలుగా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆయా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడిపేందుకు ఆదేశాలిచ్చారు. విద్యార్థులకు చల్లటి నీటితోపాటు ఇతర సౌకర్యాలను సమకూర్చారు. విద్యార్థులకు అస్వస్థతకు గురైతే ప్రాథమిక చికిత్స అందించేలా వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచనున్నారు. 

విద్యార్థులకు ఇవీ సూచనలు

* ఓఎంఆర్‌ షీట్, అడిషనల్‌ షీట్‌ పైన మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌ నెంబరు వేయాలి.

* ప్రశ్నపత్రం పైన ప్రతి పేజీలో హాల్‌టికెట్‌ నెంబరు రాయాలి.

* ఎడిషనల్‌ షీట్‌ తీసుకునేటపుడు ఆ పత్రంపై కుడివైపు పైభాగంలో సీరియల్‌ నెంబరు వేయాలి.

* ఆన్సర్‌ షీట్‌లను ట్యాగ్‌ చేసేటపుడు ఎడిషనల్‌ షీట్‌ సీరియల్‌గా ఉండేలా చూసుకుని చివరగా పార్ట్‌-బి పత్రం జతచేయడం మరువొద్దు. 

* పరీక్ష రాయడం పూర్తయ్యాక చివరి పేజీలో ది ఎండ్‌ అని రాయాలి.

* హాల్‌టికెట్, పెన్నులు తప్ప ఎలక్ట్రానిక్‌ పరికరాలు, క్యాలిక్యులేటర్, సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు.

పారిశుద్ధ్య నిర్వహణ..! 

హైదరాబాద్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా ప్రతి పరీక్ష కేంద్రాన్ని ఆదివారం శానిటైజ్‌ చేయించారు. విద్యార్థులు తప్పక మాస్కులు ధరించి రావాలని అప్రమత్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేసిపెట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని