logo

అనుమతుల పేరిట.. అక్రమ తరలింపు

జిల్లాలోని వాగులు ఇసుకాసురులకు కాసులు కురిపిస్తున్నాయి. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో యథేచ్ఛగా దోచేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ తమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా

Published : 23 May 2022 03:12 IST

 వాగుల నుంచి యథేఛ్ఛగా ఇసుక దోపిడీ

ఖానాపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని వాగులు ఇసుకాసురులకు కాసులు కురిపిస్తున్నాయి. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో యథేచ్ఛగా దోచేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ తమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఈ తతంతం మళ్లీ మొదలైనా సంబంధిత శాఖల అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు అనుమతులు పేరిట అడ్డు అదుపు లేకుండా తరలిస్తుండటంతో అక్రమ ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లు అన్న చందంగా సాగిపోతోంది. 

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని ఖానాపూర్‌ మండలం రాజురా సమీపంలోని పల్కేరు వాగు, సోమవార్‌పేట్, ఎర్వచింతల్‌ సమీపంలోని వాగుల నుంచి టిప్పర్లు, ట్రక్కుల్లో ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది. పల్కేరు వాగులో భారీ ప్రొక్లెయినర్‌తో ఇసుక తవ్వకాలు చేపట్టి కుప్పలు పోశారు. ఇలా ఇష్టారీతిన తవ్వడంతో వాగులో చెరువులను తలపించేలా పెద్దపెద్ద గుంతలు ఏర్పడంటంతో ఆ ప్రాంతాల్లో నీరు చేరితే ప్రమాదవశాత్తు అందులో పడి ప్రజలు, పశువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. పెద్దఎత్తున నిల్వ చేసిన ఇసుకను తరలించేందుకు రంగం సిద్ధం చేసుకొన్న వ్యక్తులు తరలించడానికి ప్రయత్నించగా.. కొంతమంది గ్రామస్థులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. 

స్వర్ణ పరివాహక గ్రామాలైన గొడిసెర, వంజర్, అలూరు, బోరిగాం, కాల్వ, వెంగ్వాపేట్, తల్వెద, కడ్తాల్, గంజాల్, మంజులాపూర్, మాదాపూర్, కడ్తాల్, సోన్, తదితర ప్రాంతాల మీదుగా ఇసుక తరలింపు సాగుతోంది. సుద్ధవాగు పరివాహక గ్రామాలైన సాథ్‌గాం, బిలోలి, హవర్గా, మన్మద్, అర్లి, ఇలా పలు ప్రాంతాల నుంచి అను‘మతి’ లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. నిబంధనలను కాలరాసి వాగులో ఉన్న ఇసుకను పూర్తిగా తవ్వేస్తున్నారు. కొన్నిచోట్ల పొక్లెయినర్లను ఉపయోగించి మరీ ఇసుకను తోడేస్తుండటంతో వాగులు దెబ్బతింటున్నాయి. 

ఇలా జరుగుతోంది

జిల్లాలోని వాగుల నుంచి అనుమతుల పేరిట నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా  దర్జాగా ఇసుక తరలింపు జరుగుతోంది. గతేడాది భారీ వర్షాలకు నీరు చేరడంతో ఇసుక తీయడానికి వీల్లేకుండా ఉండగా.. ప్రస్తుతం వాగుల్లో నీరు తగ్గిపోవడతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట, ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలకోసమంటూ దర్జాగా ఇసుకను తరలిస్తుండం గమనార్హం. అయితే ప్రభుత్వ పనులైనా.. నిబంధనల ప్రకారం సంబంధిత గుత్తేదారు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకొని ముందస్తు అనుమతి పొందాలి. ఎంత ఇసుక అవసరం, ఏ వాహనాలను వినియోగిస్తున్నారనే వివరాలను సమర్పించాలి. అయితే కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాగుల్లో ఉండే ఇసుక వల్ల నీటిప్రవాహం నియంత్రణలో ఉంటుంది. పెరుగుతున్న అక్రమ ఇసుకతరలింపుతో వాగులో ఇసుక కనిపించకుండా పోతోంది. భూగర్భజలాలు సైతం పడిపోతున్నాయి.

ఇలా అయితే ఎలా: పంతెంగి మోహన్, రాజురా గ్రామస్థుడు

రాజురా, చుట్టుపక్కల గ్రామాల్లో గృహ, ఇతర అవసరాలకు ఇసుకను తీసుకురాకుండా అటవీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. మా వద్ద ఉన్న వనరులను మేం వినియోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్న అధికారులు నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రవాణా చేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారు. భారీ వాహనాలతో ప్రమాదాలు జరగడమే కాకుండా వాటి ద్వారా వచ్చే దుమ్ముతో ఇబ్బందిగా మారింది. 

గతంలో ఇచ్చిన అనుమతుల మేరకు.. రాజమోహన్, తహసీల్దార్, ఖానాపూర్‌

మండలంలోని రాజురా సమీపంలోని పల్కేరు వాగు నుంచి ఇసుక తీసుకెళ్లడానికి గతంలో అధికారులు అనుమతులు ఇచ్చారు. అనుమతుల కంటే ఎక్కువగా ఇసుకను తరలించకుండా అడ్డుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని