logo

హద్దులు చెరిపి.. ఆక్రమణ జరిపె..!

లక్ష్మణచాంద గ్రామ సమీపంలోని హకీం చెరువు ఇది. 175 సర్వే నంబరులో 46.35 ఎకరాల్లో విస్తరించి ఉంది. సరస్వతీ కాలువ నీటితో మూడు కాలాల్లో ఇది నిండుగా ఉంటుంది. చెరువు కింద 200 ఎకరాల్లో ఆయకట్టు సాగవుతుంది.

Published : 23 May 2022 03:14 IST

కబ్జాకు గురవుతున్న జిల్లాలోని పలు చెరువులు

లక్ష్మణచాంద గ్రామ సమీపంలోని హకీం చెరువు ఇది. 175 సర్వే నంబరులో 46.35 ఎకరాల్లో విస్తరించి ఉంది. సరస్వతీ కాలువ నీటితో మూడు కాలాల్లో ఇది నిండుగా ఉంటుంది. చెరువు కింద 200 ఎకరాల్లో ఆయకట్టు సాగవుతుంది. వృథా నీరంతా అలుగు రూపంలో వాగులో కలుస్తుంది. ఈ చెరువును చూస్తే భూ ఆక్రమణ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చెరువు అలుగు వరకు ఆక్రమించి పంటలు సాగుచేస్తున్నారు. మిషన్‌ కాకతీయ-2లో ఎంపికై పనులు పూర్తయ్యాయి. సరిహద్దులు సగం వరకు ఏర్పాటు చేసి ఆపేయడంతో అక్రమార్కులకు వరంగా మారింది.

లక్ష్మణచాంద, సోన్‌ న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులకు పూర్వవైభవం తేవాలన్న సంకల్పంతో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా వాటి అభివృద్ధిని చేపట్టారు. అన్యాక్రాంతానికి గురైన చెరువును కాపాడేలా హద్దులను ఏర్పాటు చేసి రక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా.. అధికారుల పట్టింపు లేని కారణంగా దర్జాగా కబ్జాలకు గురవుతున్నాయి. నాలుగు విడతల్లో జిల్లాలోని 791 చెరువులను గుర్తించి 411 చోట్ల పనుల కోసం ఎంపిక చేశారు. 353 చెరువుల పనులు పూర్తికాగా.. వీటిల్లో సరిహద్దులను గుర్తించటంలో అధికారులు విఫలమయ్యారు. చిన్ననీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయ లోపం కారణంగా సరిహద్దులు గుర్తింపు జరుగక, అన్యాక్రాంతం అవుతున్నాయంటూ చాలా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

 కాదేదీ కబ్జాకు అనర్హం..

కొన్ని గ్రామాలను మినహాయిస్తే దాదాపు ప్రతి గ్రామంలో చెరువు ఉంటుంది. దశాబ్దాల క్రితం మంచి ఉద్దేశంతో గ్రామాల సరిహద్దుల్లో చెరువులను తవ్వారు. వీటిని ఆనుకొని ఉన్న రైతులు కొద్దిగా.. కొద్దిగా జరుపుతూ ఎకరాల్లో కబ్బాలకు పాల్పడుతున్నారన్న విషయం గ్రామాల్లో  బహిరంగ రహస్యమే. జిల్లాలోని ప్రతి చెరువు కొంత భాగమైనా ఆక్రమణకు గురై కనిపిస్తుంది. మిషన్‌ కాకతీయ పథకంలో ఆక్రమణ భూములను స్వాధీనం చేసేందుకు హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇవేవి కనిపించటం లేదు. 

సారంగాపూర్‌ మండలంలోని జాం గ్రామంలోని కోమటి చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. దాదాపు 20 ఎకరాల వరకు చెరువుల అన్యాక్రాంతానికి గురైనట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మిషన్‌ కాకతీయలో పనులు చేపట్టినా చెరువుకు హద్దులు గుర్తించకపోవటంతో కొందరు దర్జాగా పొలాలను సాగు చేసుకుంటున్నారు. అన్యాక్రాంతానికి గురైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకొని చెరువును కాపాడాలని కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని