logo

తునికాకు బోనస్‌పై ఆశలు

ఏళ్లుగా ఎదురుచూస్తున్న కూలీలకు తునికాకు సేకరణ బోనస్‌ డబ్బులు చెల్లించేందుకు అటవీశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఏటా ఆకులు సేకరిస్తున్న వారికి వెంటనే కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ వాటిని

Published : 23 May 2022 03:29 IST

 కూలీల వివరాలు పంపించిన అధికారులు

ఆసిఫాబాద్, న్యూస్‌టుడే: ఏళ్లుగా ఎదురుచూస్తున్న కూలీలకు తునికాకు సేకరణ బోనస్‌ డబ్బులు చెల్లించేందుకు అటవీశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఏటా ఆకులు సేకరిస్తున్న వారికి వెంటనే కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ వాటిని విక్రయించాక వచ్చిన లాభాన్ని ప్రభుత్వం తిరిగి కూలీలకే బోనస్‌గా చెల్లిస్తుంది. అయితే 2016 నుంచి ఇప్పటి వరకు ఆ డబ్బులు చెల్లించలేదు. కూలీలు వీటికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పెండింగ్‌ బోనస్‌ వివరాలను పంపించాలని రాష్ట్ర అటవీశాఖ ఆదేశాలతో జిల్లా శాఖ అధికారులు కూలీల పేర్లు, వారు సేకరించిన ఆకుల కట్టల సమాచారం పంపించడంతో వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి.

అడవులపై ఆధార పడ్డ గిరిజనులు అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనోపాధి పొందుతుంటారు. వేసవిలో వ్యవసాయ పనులు ఉండవు. దీంతో తునికాకు సేకరణతో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతారు. ఏటా మే నెలలో అటవీశాఖ ఆకు సేకరణ మొదలు పెడుతోంది. జిల్లాలో 2017 వరకు ఏటా సుమారు 15 వేలకు పైగా కూలీలు తునికాకు సేకరించేవారు. ఆ తర్వాత క్రమంగా వారి సంఖ్య తగ్గుతోంది. 2013 నుంచి 2015 వరకు(అంతకు ముందు సంవత్సరాల్లో వచ్చిన లాభాలు) మూడేళ్ల బోనస్‌ రూ.7.25 కోట్లకు గాను 2019లో ప్రభుత్వం రూ.6.56 కోట్లు విడుదల చేసింది. వీటిని ఆ సమయంలోనే అటవీ అధికారులు కూలీలకు పంపిణీ చేశారు. పాతవి ఆసిఫాబాద్‌ డివిజన్‌కు సంబంధించి ఇంకా రూ.68.65 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ సారి లక్ష్యసాధన గగనమే..

 జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ డివిజన్‌ల పరిదిలోని 23 యూనిట్లలో తునికాకు సేకరణ చేపట్టారు. వీటి పరిధిలో 174 కల్లాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు 30,100 స్టాండర్డ్‌ బ్యాగుల (ఒక్క ఎస్‌బీలో వెయ్యి కట్టలు) సేకరణ లక్ష్యం విధించారు. ఇందుకు కూలీ డబ్బుల కోసం రూ.6.17 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 16,441 ఎస్‌బీలు మాత్రమే సేకరించారు. 50 ఆకుల కట్టకు కిందటి సారి రూ.2 చెల్లించగా.. ఈసారి ఐదు పైసలు పెంచారు. ఒక్కో కూలీ రోజుకు సగటున రూ.350 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలో ఆకు సేకరణ ఈ నెల 7 నుంచి 8 తేదీల్లో మొదలు కావడం, వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు.. వెరసి లక్ష్య సాధన చేరుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో సుమారు ఆరేడు వేల మంది కూలీలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నట్లు సమాచారం.

బోనస్‌ విషయంపై జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాంను ‘న్యూస్‌టుడే’ చరవాణిలో సంప్రదించగా.. ఉన్నతాధికారులు వివరాలు కోరడంతో పంపించామన్నారు. 

రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు అంచనా..

2016 నుంచి ఇప్పటి వరకు బోనస్‌ విడుదల చేయలేదు. ఏటా జిల్లాకు సుమారు రెండు కోట్ల రూపాయలు చొప్పున బోనస్‌ రూపంలో రావచ్చని అంచనా. దీనిని బట్టి జిల్లాకు సుమారు రూ.10-12 కోట్ల వరకు(మధ్యలో కరోనాతో కాస్త తగ్గింది) వచ్చే అవకాశం ఉంది. అయితే 2015లో రావాల్సిన పెండింగ్‌తో పాటు 2016 బోనస్‌ను ఇప్పటికే విడుదల చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని