logo

అంకెల గారడి.. మామూళ్ల ఒరవడి

పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్‌ మట్కా నిర్వహణకు కేంద్రంగా మారింది. సులువుగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో చిన్నాపెద్ద తేడా లేకుండా జూదానికి బానిసలవుతున్నారు. ఆపై ఆర్థికంగా చితికిపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 23 May 2022 05:05 IST

జిల్లాలో ఆగని మట్కా దందా..

కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, న్యూస్‌టుడే:  పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్‌ మట్కా నిర్వహణకు కేంద్రంగా మారింది. సులువుగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో చిన్నాపెద్ద తేడా లేకుండా జూదానికి బానిసలవుతున్నారు. ఆపై ఆర్థికంగా చితికిపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని అరికట్టాల్సిన పోలీసులు కూడా జూదరులతో జతకట్టి ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. తరచూ పోలీసులు పట్టుబడుతున్న నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు.

 మనకు ‘మహా’ ముప్పు..

 జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, ముంబయి ప్రాంతాల నుంచి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, ఈజ్‌గాం, తదితర ప్రాంతాల్లోని వ్యక్తులతో పరిచయాలు చేసుకొని మట్కా ఏజెంట్లుగా మారుస్తున్నారు. ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటు చేసుకుకొని ఆట నిర్వహిస్తున్నారు. కొందరు యువకులు ఇళ్లల్లోనే కంప్యూటర్, స్మార్ట్‌ ఫోన్ల సహాయంతో ఈ దందాను కొనసాగిస్తున్నారు. కొంతమంది పట్టణంలోని శిథిలమైన గృహాలను అద్దెకు తీసుకొని చిట్టీల ద్వారా నిర్వహిస్తున్నారు. నిత్యం రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. అంకెల గారడితో సాగే ఈ జూదంలో చాలా మంది ఆర్థికంగా చితికి పోతుంటే నిర్వాహకులు మాత్రం రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. 

 నామమాత్రపు కేసులు..

 మట్కాపై పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా.. నామ మాత్రపు కేసులు నమోదు చేయడంతో వారిలో భయం లేకుండా పోతోంది. పైగా నిర్వాహకుల్లో చాలా మందికి వివిధ పార్టీల నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. దీంతో కొంతమంది ఖాకీలు కూడా వారి వద్ద నుంచి ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

అదృష్ట సంఖ్యలు చూసుకొని మరీ..

మట్కా అంటే హిందీలో ‘కుండ’ అని అర్థం. గతంలో కుండలో కొన్ని సంఖ్యలు రాసిన చిటీలు వేసి లాటరీ పద్ధతిలో ఒకటి తీసేవారు. ఆ సంఖ్యను ఊహించి తెలిపిన వారికి డబ్బులు చెల్లించేవారు. కాలక్రమేణా ఈ విధానం మట్కాగా రూపుదాల్చింది. ఆదివారం, పండగలు మినహా ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో కల్యాణి ప్రారంభ అంకెను ప్రకటించి గంటన్నర వ్యవధి తర్వాత చివరి అంకెను ప్రకటిస్తారు. తాను ఊహించిన నెంబరు తగిలితే రూ.10కి రూ.500 నుంచి రూ.600 చెల్లిస్తుంటారు. మహారాష్ట్రలో రూ.10కి వెయ్యి చొప్పున చెల్లిస్తారు. మట్కా ఛార్టులో అంకెల గారడీని గుర్తించి స్వయంగా ఊహించి ప్రస్తుతం నడుస్తున్న నంబరు ఎంత? తర్వాత వచ్చే సంఖ్య.. ఇలా అంచనాలు, లెక్కలతో సాగే జూదమే మట్కా. అయితే కొందరు వివిధ దినపత్రికల్లోని రాశిఫలాలు, అదృష్ట సంఖ్యలు చూసుకొని ఈ ఆటలో పాల్గొంటున్నారు. 

*  ఆన్‌లైన్‌ వేదికగా ఎక్కువగా జరిగే మట్కా ఆటను పూర్తిగా అరికట్టలేకపోతున్న పోలీసులు అక్రమార్కులతో జతకట్టి అందిన కాడికి దండుకుంటూ.. ఆ శాఖకు మచ్చ తెస్తున్నారు. ఇటీవల ఓ మట్కా కేసు ముడుపుల వ్యవహారం జిల్లా పోలీసుబాస్‌కు తెలియడంతో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. గతేడాది కూడా ఓ ఎస్సైని కూడా ఈ విషయంలోనే జిల్లా కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఇవే కాకుండా మట్కా నిర్వాహకులను పట్టుకున్నపుడు కొందరు పోలీసులు వారి వద్ద ఉండే విలువైన చరవాణులను తీసుకొని తిరిగి ఇచ్చే సమయంలో మామూలు ఫోన్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

కఠిన చర్యలు తీసుకుంటాం..: కరుణాకర్, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

 ప్రభుత్వం నిషేధించిన మట్కాను నిర్వహిస్తున్న వారితో పాటు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశాం. అంకెల పేరిట జరిగే మోసపూరితమైన జూదం ఇది. దీనికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు. అవసరమైతే నిర్వాహకులపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని