logo

వాహనంకొని బేజారు.. రాయితీ అందని తీరు

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంజూరవుతున్న పథకాలకు ప్రభుత్వం రాయితీ విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పు చేసి కొనుగోలు చేసిన వాహనాలకు.. పెట్టుబడి, వడ్డీ రాయితీ కోసం నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్నారు.

Published : 25 Jun 2022 04:24 IST

జిల్లాలో రూ.4.55 కోట్ల ట్రీ-ప్రైడ్‌ బకాయిలు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంజూరవుతున్న పథకాలకు ప్రభుత్వం రాయితీ విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పు చేసి కొనుగోలు చేసిన వాహనాలకు.. పెట్టుబడి, వడ్డీ రాయితీ కోసం నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్నారు. అధికారులు కూడా త్వరలో వస్తాయనడం తప్ప.. ఏమీ చేయలేకపోతున్నారు. జిల్లాలో 2018 నుంచి రూ.4.55 కోట్ల రాయితీ విడుదల కావాల్సి ఉంది.

పరిశ్రమలు, సేవా, రవాణా రంగంలో నిరుద్యోగ యువత రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏటా టీ-ప్రైడ్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల(ఓసీ/ఓబీసీ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది)కు పెట్టుబడిలో 35 శాతం, మహిళలకు 45 శాతం రాయితీతోపాటు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. జిల్లాలో టీ ప్రైడ్‌లో ఎక్కువమంది రవాణా రంగంపై మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 98 మంది సొంత డబ్బులు, అప్పు చేసి వాహనాలు కొనుగోలు చేశారు. రాయితీ కోసం పరిశ్రమల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.

నాలుగేళ్లుగా విడుదలకాని వైనం..

గతంలో వాహనం కొనుగోలు చేయాలంటే మొదట పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసేవారు. ప్రభుత్వం మంజూరు చేస్తే.. సొంత డబ్బులు లేదా బ్యాంకు రుణం ద్వారా కొనుగోలు చేసేవారు. తరువాత  ప్రభుత్వం వారికి రాయితీ విడుదల చేసేది. ఈ విధానంలో కొందరు రాయితీ డబ్బులు రాగానే యూనిట్లు అమ్ముకోవడం, మూసివేయడం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. మొదట వాహనం కొనుగోలు చేసి తరువాత రాయితీ కోసం పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసే విధానం అమల్లోకి తెచ్చింది. జిల్లాలో 98 మంది బ్యాంకు రుణాలు, ప్రైవేటులో అప్పు, కొంత సొంత డబ్బులు సమకూర్చుకొని వాహనాలు కొనుగోలు చేశారు. వారు పెట్టుబడి, వడ్డీ రాయితీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా జిల్లాలో నాలుగేళ్లుగా రూ.4.55 కోట్లు రాయితీ బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఇవి అందక అప్పుచేసి కొన్నవారు అసలు, వడ్డీ చెల్లించలేక సతమతమవుతున్నారు.


అప్పుచేసి కొన్నా..

రత్నం తిరుపతి, వెల్గి

మాది వాంకిడి మండలం వెల్గి. స్వయం ఉపాధి కోసం అప్పు చేసి రూ.9 లక్షలతో 2018లో స్విఫ్ట్‌ డిజైర్‌ కారు కొనుగోలు చేశా. రాయితీ కోసం పరిశ్రమల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ నయాపైసా రాలేదు. కార్యాలయంలో సంప్రదిస్తే.. త్వరలో వస్తాయని చెపుతూ ఇప్పటి వరకు నాలుగేళ్లు గడుస్తోంది. చేసిన అప్పు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి రాయితీ విడుదల చేసి ఆదుకోవాలి.


విడుదల చేయగానే అందజేస్తాం

- రఘు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌

జిల్లాలో మంజూరైన యూనిట్ల ఆధారంగా బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాం. విడుదల కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం. మా దగ్గర ఎలాంటి పెండింగ్‌ బకాయిలు లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని